
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి దీక్ష
– పెండ్లి చేసుకోవాలని డిమాండ్
– మంతనాలు జరుపుతున్న పెద్దలు
దామరచర్ల (నల్లగొండ) : ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని నమ్మబలికాడు.. శారీరకంగా అనుభవించాడు. చివరాకరకు వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు ఓ యువకుడు. దీంతో ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకొంది. బాధితురాలి వివరాల ప్రకారం...దామరచర్లకు చెందిన నీరుకంటి శ్రీను, మిర్యాలగూడకు చెందిన మాడిశెట్టి గౌతమి రెండేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామజికవర్గానికి చెందిన కావడంతో వీరి వివాహానికి అప్పట్లో వారిరువురి తల్లిదండ్రులు సమ్మతించారు. అయితే అడిగిన కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో శ్రీను తరుఫువారు వివాహానికి నిరాకరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో రాజీ కుదిరింది. అయితే నాలుగు నెలల కిందట అమ్మాయికి గుంటూరు జిల్లా దుర్గికి చెందిన వ్యక్తితో వివాహమైంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
ఇటీవల తల్లిగారింటికి వచ్చిన గౌతమి తిరిగి అత్తగారింటికి వెళుతున్న విషయాన్ని పసిగట్టిన శ్రీను ఆమెను అనుసరించి మాయ మాటలు చెప్పి దాచేపల్లి నుంచి అతడి బంధువుల ఇంటికి మంగళగిరికి తీసుకెళ్లాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి మూడు రోజుల పాటు తనను శారీరకంగా వాడుకున్నాడని, అనంతరం మిర్యాలగూడలో వదిలేశాడని గౌతమి పేర్కొంది. తన అత్తగారి ఇంటి వాళ్లు కూడా తిరిగి తనను తీసుకవెళ్లేందుకు నిరాకరిస్తున్నారని వాపోయింది. తనను వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీను ఇంటి ఎదుట దీక్షకు దిగింది. గౌతమి దీక్షకు బీజేపీ నాయకుడు వనం మధన్‌మోహన్, ఇతర మహిళా సంఘాల నాయకురాళ్ల మద్దతు పలికారు. అయితే శ్రీను కుటుంబసభ్యులు ఎవరూ అందుబాటులో లేరు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పెద్ద మనుష్యులు మంతనాలు సాగిస్తున్నారు.