చనిపోయిన మేకలు
రణస్థలం : రణస్థలం పంచాయతీ పిట్టపాలేం గ్రామానికి చెందిన ఆవల లక్ష్మణరావుకు చెందిన తొమ్మిది మేకలు సోమవారం ఉదయం మృతి చెందాయి. లక్ష్మణరావుకు 15 మేకలు ఉండగా ఇందులో ఒక మేకకు జబ్బు చేసి చనిపోవటంతో సమీపంలోని రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆర్‌ఎస్‌ఎన్ పట్నాయిక్‌కు విషయం తెలియజేశారు. మేక చనిపోయిందని మిగతా మేకలకు ఎటువంటి జబ్బు రాకుండా మందులు వేయాలని లక్ష్మణరావు కోరడంతో సోమవారం ఉదయం రిటైర్డ్ వైద్యులు పట్నాయిక్ పిట్టపాలేం వెళ్లి మేకలకు ఇంజక్షన్‌లు చేశారు. 14 మేకలకు ఇంజక్షన్‌లు చేయగా చేసిన 5 నిమిషాలకే ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది మేకలు మృతి చెందాయి.
విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారులు బి.దుర్గారావు, రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మందు తీవ్రతను మేకలు తట్టుకోలేకపోయాయని సమయంలో విరుగుడు ఇవ్వలేకపోవటం వల్ల చనిపోయాయని వైద్యులు చెప్పారు. బాధితునికి శాఖ తరఫున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్ట్ వైద్యులు పట్నాయిక్ మాట్లాడుతూ తాను సరిగానే ఇంజక్షన్‌లు చేశానని జబ్బు వల్ల చనిపోయి ఉంటాయని చెప్పారు.