సూదిమందు వికటించి శిశువు మృతి
కొల్చారం మండలం కొంగోడ్‌లో విషాదం
కొల్చారం: ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ (పీఎంపీ) ఇచ్చిన సూదిమందు వికటించడంతో ఏడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన కొంగోడ్‌లో శుక్రవారం వెలుగుచూసింది. కొల్చారం ఎస్‌ఐ విద్యాసాగర్‌రెడ్డి కథనం ప్రకారం... కొంగోడ్‌కు చెందిన వంజరి ఏగోండ, లింగమ్మ దంపతుల కుమారుడు తేజ (ఏడు నెలలు) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడికి వైద్యం చేయించారు. అక్కడి డాక్టర్ మూడు రోజుల క్రితం బాలుడికి సూదిమందులు రాసి ఇచ్చారు. వాటిని రోజూ బాలుడికి ఇప్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో వారు గ్రామంలోని పీఎంపీ వద్ద మూడు రోజులుగా బాలుడికి సూదిమందు ఇప్పించారు. గురువారం రాత్రి ఎప్పటిలాగే బాలుడికి సూదిమందు ఇచ్చిన వెంటనే ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు బాలుడి శవాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.