నీటివాటాలో సీమకు అన్యాయం
నీటివాటాలో సీమకు అన్యాయం
Published Wed, May 10 2017 10:00 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
- సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం
- ఉద్యమించకుంటే మిగిలేది కన్నీరే
- 21న నంద్యాలలో జల చైతన్య సభ
- సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి
కర్నూలు సిటీ: నీటివాటాలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆరోపించారు. బుధవారం కర్నూలులోని ఓ హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ(అరుణ్), హంద్రీనీవా పరిరక్షణ సమితి అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, సాధన సమితి నాయకులు తిరుపతి రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడారు. సీమలో ప్రకృతి వనరుల లభ్యత అధికంగా ఉన్నా.. వినియోగంలో మాత్రం చాలా వెనుకంజలో ఉన్నామన్నారు. రాయలసీమ అంటే కరువు ప్రాంతం అని గుర్తుకు వచ్చేందుకు ప్రకృతి వైపరీత్యాలు కారణం కాదని, పాలకుల నిర్లక్ష్యం, ప్రజలలో సరైన అవగహన లేకపోవడమేనన్నారు.
నీటి వాటాలపై చట్టబద్ధత ఏదీ?
రాష్ట్రం విస్తీర్ణం 394.88 లక్షల ఎకరాలని, ఇందులో 41.99 శాతం రాయలసీమలోను, దక్షణ కోస్తాలో 43.32 శాతం, ఉత్తర కోస్తాలో 14.69 శాతం భూములు ఉన్నాయన్నారు. ఇందులో సాగుకు యోగ్యమైన భూమి 45.37 శాతం(98.95 లక్షల ఎకరాలు), దక్షిణ కోస్తాలో 41.78 శాతం(91.14 లక్షల ఎకరాలు), ఉత్తర కోస్తాలో 12.85 శాతం(28.03 లక్షల ఎకరాలు) ఉందన్నారు. రాయలసీమలో వ్యవసాయ యోగ్యమైన భూమి 15.5 శాతం మాత్రమేనన్నారు. దక్షిణ కోస్తాలోని కృష్ణా, గూంటురు జిల్లాల్లో 83.5 శాతం భూమికి సాగు నీటి సదుపాయం ఉందన్నారు. అయినా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు ఆ ప్రాంతంలోనే నిర్మిస్తోందని ఆరోపించారు. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాలకు నిధులు, నీళ్లు కేటాయిస్తున్నారని, దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణా డెల్టాకు సాగు నీటి కోసం పులిచింతల, పట్టిసీమ, పోలవరంతో పాటు మొత్తం 6 స్థీరికరణ ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. రాయలసీమలో మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు. పట్టిసీమ, పులిచింతల ద్వారా ఎన్ని నీళ్లు ఇస్తున్నారో.. అదే స్థాయిలో శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చట్టబద్ధథ కల్పించాలన్నారు. పట్టిసీమతో సీమ సస్యశ్యామలమని చెప్పి అధికార పార్టీ నేతలు ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు.
మేల్కోకపోతే కన్నీటి కష్టాలు..
కరువు సీమను కాపాడేందుకు ప్రజలంతా ఏకం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే మిగులు జలాలపై నిర్మించిన ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించాలన్నారు. సీమలో ఒక్కో జిల్లాకు 100 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల21వ తేదీన నంద్యాలలో జరిగే జల చైతన్య సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Advertisement