ప్రతిభకు పాతర
Published Tue, Aug 9 2016 5:40 PM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
అధికార పార్టీ ఎమ్మెల్యేలు
చెప్పిన వారికే ఇన్‌స్ట్రక్టర్ల ఉద్యోగం
పాఠశాలలనూ వదలని రాజకీయాలు
ఎమ్మెల్యేలు చెప్పిన అభ్యర్థులు..
లేరని భర్తీకి నోచని 100 పోస్టులు
గుంటూరు ఎడ్యుకేషన్ : అధికార పార్టీ నేతల నీచ రాజకీయాలు విద్యాలయాలను సైతం విడిచి పెట్టడంలేదు. ప్రతిభ ఆధారంగా జరపాల్సిన నియామకాలు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికపై భర్తీ చేయాల్సిన పోస్టులు అర్హులైన అభ్యర్థులున్నా ఖాళీగా మిగిలిపోయాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యా బోధనకు కాంట్రాక్టు పద్ధతిపై పార్ట్ టైం ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం అనుమతివ్వగా, జిల్లాలో 275 పోస్టుల భర్తీకి సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) చర్యలు చేపట్టింది. ఒక్కో ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.5,000 వేతనాన్ని నిర్ణయించారు. జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్‌ల వారీగా పాఠశాలల్లో ఖాళీల ఆధారంగా అవసరమైన చోట ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాల్సి ఉంది. వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, పీఈటీ, మ్యూజిక్, డ్రాయింగ్ విభాగాల వారీగా విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు పని చేయాల్సి ఉంటుంది.
హెచ్‌ఎంలపై ఒత్తిడి...
ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే నియమించుకుని, ధృవీకరణ కోసం ఎస్‌ఎస్‌ఏ జిల్లా అధికారులకు పంపాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో హెచ్‌ఎంల అంగీకారం కంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతోనే నియామకాలు జరిగాయి. 10 నెలల కాలానికి, అందులోనూ కాంట్రాక్ట్ పద్ధతిపై చేపట్టిన ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలను సైతం వదలకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే తాము చెప్పిన అభ్యర్థులకే పోస్టింగ్స్ కల్పించాలని హెచ్‌ఎంలపై ఒత్తిడి తేవడంతో చేసేది లేక వారు చెప్పినట్టే నియమించారు. రాజకీయంగా తమకు అనుకూలురు, కార్యకర్తల కుటుంబ సభ్యులకు పోస్టులు కట్టబెడుతూ వచ్చిన ఎమ్మెల్యేలు జిల్లాలోని 275 పోస్టులకు గానూ 175 మందికి సిఫార్సు చేశారు. వారికి అనుకూలమైన అభ్యర్థులు లేక మరో 100 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తుండగా, మితిమీరిన రాజకీయ జోక్యంతో 100 పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. ఫలితంగా పాఠశాలల్లో విద్యార్థులకు వృత్తి విద్యా బోధనకు అవకాశం లేకుండా పోయింది.
కమిటీల ద్వారానే...
జిల్లాలో ఒకేషనల్ పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల నియామకం విషయంలో నెలకొన్న రాజకీయ జోక్యం, భర్తీ కాకుండా మిగిలిపోయిన 100 పోస్టుల విషయమై ఎస్‌ఎస్‌ఏ అధికారులను వివరణ కోరగా, ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు పూర్తిగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ద్వారానే జరుగుతున్నాయని, ఇందులో తమ జోక్యం లేదని చెబుతున్నారు.
Advertisement
Advertisement