నేస్తమా.. మళ్లీ కలుద్ధామా!
జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఆదివారం ముగిశాయి. ఇంత కాలం పుస్తకాలతో మమేకమై తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించిన విద్యార్థులు చివరి రోజు ఉత్సాహంగా కనిపించారు. పరీక్షలు పూర్తి కాగానే ఒకరినొకరు కలుసుకుని పరీక్షలు ఎలా రాసింది తెలుసుకున్నారు. ఉన్నత చదువులకు పునాదులు వేసుకోవడంలో భాగంగా ఎక్కడ కోచింగ్ చేరుతున్నావంటూ అడిగి తెలుసుకున్నారు. చివరి క్షణాలను సెల్ఫీరూపంలో జీవిత కాలం పదిలపరుచుకున్నారు. నేస్తమా.. మళ్లీ కలుద్ధామంటూ బస్కెక్కి తమతమ సొంతూళ్లకు బయలుదేరారు. ఇది కేవలం జిల్లా కేంద్రం అనంతపురంలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఆదివారం కనిపించింది.
- అనంతపురం ఎడ్యుకేషన్
చివరి రోజూ 465 మంది గైర్హాజరు
పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు 14తో పూర్తి కావాల్సి ఉంది. అయితే 9న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరగాల్సిన గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్ష ఆదివారానికి మార్చారు. కాగా, ఆదివారం జరిగిన పరీక్షలకు మొత్తం 465 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు సంబంధించి మొత్తం పది మంది విద్యార్థులు డీబార్ అయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఐదుగురు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఐదుగురు ఉన్నారు. అలాగే ఒక్క ఇన్విజిలేటర్, ఇతర సిబ్బందిని కూడా విధుల నుంచి తప్పించలేదు.