మండలంలోని కొక్కంటి సమీపంలో రాజన్న మిట్ట మలుపు వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి జరిపిటి శ్రీనివాసులు(17) మృతిచెందాడు.
తనకల్లు: మండలంలోని కొక్కంటి సమీపంలో రాజన్న మిట్ట మలుపు వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి జరిపిటి శ్రీనివాసులు(17) మృతిచెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చెక్కవారిపల్లికి చెందిన జరిపిటి శ్రీనివాసులు.. తనకల్లులోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు. తన బంధువులు శశికుమార్, సుప్రియతో కలిసి వ్యక్తిగత పనిపై గురువారం కొక్కంటి క్రాస్‌కు వచ్చిన శ్రీనివాసులు, అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు.
రాజన్న మిట్ట మలుపు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న డేరంగుల శ్రీనివాసులు ఢీకొనడంతో నలుగురూ గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 ద్వారా కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసులు మరణించాడు. డేరంగుల శ్రీనివాసులు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి తీసుకెళ్లారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.