పోరాడి గెలిచిన ఇంటర్ విద్యార్థిని
- పునర్‌మూల్యాంకనం ద్వారా న్యాయం
- రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానాన్ని సొంతం చేసుకున్న శిరీష
సిద్దిపేట టౌన్: ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం ఓ పేద విద్యార్థినికి రాష్ట్ర స్థాయి స్థానాన్ని దూరం చేసింది. అయినా ఆ విద్యార్థిని పోరాడి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. జవాబు పత్రాలు పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకుని విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
మెదక్ జిల్లా సిద్దిపేటలోని మాస్టర్ మైండ్స్ కళాశాలకు చెందిన శిరీష.. ఇటీవల వెలువడిన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో బైపీసీలో 433 మార్కులు సాధించింది. తనకు తక్కువ మార్కులు వచ్చాయని భావించిన ఆమె రీ వెరిఫికేషన్ కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకుంది. స్పందించిన అధికారులు శిరీష జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేయగా అదనంగా రెండు మార్కులు వచ్చాయి.
దీంతో మొత్తం 435 మార్కులు సాధించిన ఆమె రాష్ట్ర స్థాయిలో రెండోస్థానాన్ని సొంతం చేసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆమె కోరింది. రాష్ట్రంలో రెండోస్థానాన్ని సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది. కళాశాల కరస్పాండెంట్, అధ్యాపకులు ఆమెను అభినందించారు.