
అన్నీ ఎంఎల్ సంఘాలే..
ప్రపంచ మహాసభలతో ఒకే వేదికపైకి..
పెద్దపల్లి : గోదావరిఖనిలో ఈనెల 2నుంచి జరుగుతున్న అంతర్జాతీయ గని కార్మిక మహాసభలు.. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. సింగరేణి కార్మిక సమాఖ్య తర్వాత ఆ స్థాయిలో విప్లవపంథాల్లో కార్మిక ఉద్యమాలను మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ సంఘాలే నడిపించాయి.. గోదావరిలోయ పరివాహక ప్రాంతాల్లో పార్టీలతోపాటు కార్మిక సంఘాల కార్యకలాపాలు కూడా విస్తరించాయి. ఫలితంగా జార్ఖండ్, బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎంఎల్ అనుబంధ సంఘాలు పురుడుపోసుకున్నాయి. దీంతో ఈ ప్రపంచ మహాసభలకు 17దేశాలకు చెందిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీల అనుబంధ సంఘాలతో పాటు దేశంలోని జార్ఖండ్, బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనుబంధ కార్మిక ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని బొగ్గు గని ప్రాంతంలో పనిచేస్తున్న ఏఐఎఫ్‌టీయూ, ఐఎఫ్‌టీయూ(రెండు వర్గాలు) సంయుక్తంగా ఈ సభలను నిర్వహిస్తోంది.
ఇక ప్రపంచ మహాసభల నిర్వహణతో ఎంఎల్ పార్టీ ఉనికి మరోసారి కార్మిక సంఘాల్లో చాటుకున్నట్లయింది. గోదావరిఖని కేంద్రంగా ఇఫ్టూ సాగించిన పోరాటంలో సీపీఐ ఎంఎల్ విమోచన చండ్రపుల్లారెడ్డి వర్గానికి చెందిన నాయకులు పెద్దసంఖ్యలో అమరులయ్యారు. ఎన్ కౌంటర్ల కారణంగా రహస్యపార్టీ కార్యకర్తలను కోల్పోయినా.. ప్రజాసంఘాలు, ట్రేడ్ యూనియన్ల రూపంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌బెల్ట్ ప్రాంతంలో సీపీఐఎంఎల్ జనశక్తి, విమోచన, న్యూడెమొక్రసీ అనుబంధ సంఘాలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.
చీలిపోయిన సంఘాలు కలిసి..
భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు–లెనినిస్టు)పార్టీ విమోచనగ్రూప్‌గా చండ్ర పుల్లారెడ్డి నాయకత్వంలో గోదావరి లోయ పరివాహక ప్రాంతాలైన తెలంగాణతో పాటు జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో బొగ్గు గని కార్మిక సంఘాలను ప్రారంభించారు. తర్వాత చండ్ర పుల్లారెడ్డి గ్రూపు నుంచి పైలా వాసుదేవరావు, రాయల సుభాష్ చంద్రబోస్, చంద్రన్న వర్గం, రాంచంద్రన్ వర్గం, రాధక్క వర్గం విడిపోయాయి. ఇలా చీలికలు పేలికలైన చండ్ర పుల్లారెడ్డి వర్గంలోని కార్మిక సంఘం మాత్రం బలంగా ఉండడం విశేషం. ప్రస్తుతం గోదావరిఖనిలో నిర్వహిస్తున్న సభలకు చండ్రపుల్లారెడ్డి వర్గంతోపాటు దానినుంచి విడిపోయిన పార్టీల అనుబంధ సంఘాలు ఐఎఫ్‌టీయూ(రెండువర్గాలు). ఏఐఎఫ్‌టీయూ ఇలా మూడు గ్రూపులు కలిసి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నాయి.