అంతర్జాతీయ సదస్సుకు పరంజ్యోతి విద్యార్థులు
అమలాçపురం రూరల్ :
ఇండోనేషియా రాజధాని జకర్తలాలో రెండు వారాల పాటు జరిగే గ్లోబల్ స్కూల్ అంతర్జాతీయ సదస్సుకు అమలాపురం మండలం కామనగరువులోని పరంజ్యోతి పాఠశాల పదో తరగతి విద్యార్థులు ఇద్దరు హాజరవుతున్నారు. ప్రపంచ దేశాల్లోని విద్యా విధానం.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు పరంజ్యోతి విద్యార్థులు ఎంపిక కావడం హర్షణీయమని ఆ విద్యా సంస్థల రెసిడెన్షియల్ డైరెక్టర్ కార్ల్ డేవిడ్ కొమానపల్లి (లాల్), అకడమిక్స్ డైరెక్టర్ ఎస్తేరు జ్యోతి తాతపూడి తెలిపారు. మంగళవారం ఆ స్కూలులో ప్రిన్స్‌పాల్ ప్రదాప్ ఫిలిక్స్, ఆస్ట్రేలియాకు చెందిన విద్యావేత్త జెన్నీఫర్ జోన్స్‌తో కలసి విలేకర్లతో మాట్లాడారు. తమ స్కూలు విద్యార్థులు పరమట శివాని, ఇమ్మానియేల్ పాల్ కొమనాపల్లితో పాటు స్కూలు కో ఆర్డినేటర్ నూకపెయ్యి ఆదిలక్ష్మి సదస్సుకు వెళ్లనున్నారన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాకు చెందిన విద్యా సంస్థతో ఒప్పందం కుదర్చుకున్నామని చెప్పారు. ఆ దేశ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తమ పాఠశాలకు వచ్చి విద్యా బోధన చేస్తున్నారన్నారు. ఈ నెల 30న విద్యార్థులు ఇండోనేషియా బయలు దేరుతున్నారన్నారు. ఆ దేశాల్లో ఉన్న విద్యా సమస్యలను వారు ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకుని ఇక్కడ పరిష్కారానికి విద్యార్థుల్లో చైతన్యం నింపుతామని లాల్ తెలిపారు. అంతర్జాతీయ సదస్సుకు వెళ్తున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.