తాగుతారు.. తిడతారు.. అంతా వాళ్లిష్టం
మేమేం చేస్తాం.. మీరే తప్పుకొని పోవాలి
కంచరపాలెం ఏఎస్‌ఐ జ్యోతి బాధ్యతారాహిత్యం
ఫిర్యాదుదారులకు న్యాయం చేయకపోగా ఉచిత సలహాలు
తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బీరాలు
విశాఖపట్నం : ‘మందుబాబులు తాగి తందనాలాడతారు.. ఎవరినైనా తిడతారు.. మనం అవేవీ పట్టించుకోకూడదు.. చూసీ చూడనట్టు వదిలేయాలి తప్ప రోడ్డున పోయే దాన్ని నెత్తిన రాసుకోకూడదు.. అయినా ఈ ప్రపంచాన్ని మనం మార్చేయగలమా? బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకూడదని బోర్డులు పెడుతున్నారు. ఎవరైనా పాటిస్తున్నారా? మనం కరెక్ట్‌గా ఉన్నామని అందరూ అలాగే ఉండాలని లేదు.. అయినా మా స్టేషన్‌లో 30 మంది సిబ్బంది ఉన్నారు. స్టేషన్ పరిధిలో 12లక్షల మంది జనాభా ఉన్నారు. వారందరికీ భద్రత కల్పించాలంటే ఈ 30 మంది వల్ల జరిగే పనేనా? ప్రతి ఒక్కరికీ రక్షణ కావాలంటే పోలీస్ కమిషనర్ దగ్గరకు వెళ్లి అడిగితే ఓ కానిస్టేబుల్‌ను ఇస్తారు. అంతే తప్ప అందర్నీ చూడాలంటే మా వల్ల కాదు’.. ఇవీ బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఓ మహిళా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఉచిత సలహాలు ఇస్తూ విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ఆమె పేరు జ్యోతి. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ. ఓ కేసుకు సంబంధించి వివరణ కోరిన ’సాక్షి’తో ఆమె అన్న మాటలవి.
ఇదీ కేసు నేపథ్యం
బర్మా క్యాంప్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి. అందునా గౌరవ ప్రదమైన వైద్యాలయంలో పనిచేస్తున్నారు. కానీ ఏం లాభం అక్కడున్న బెల్టుషాపులో పూటుగా మద్యం సేవించి రెండ్రోజుల క్రితం వీరంగం సృష్టించాడు. స్థానికులతో అనుచితంగా ప్రవర్తించాడు. గతంలోనూ ఇదే విధంగా చేయడంతో సహించలేక బాధితులు కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ చంద్రశేఖర్‌కు తమ గోడు చెప్పుకున్నారు. విషయమేమిటో చూడాలని ఏఎస్‌ఐ జ్యోతికి సీఐ చెప్పారు. కానీ ఆ సమస్యను ఆమె సీరియస్‌గా తీసుకోలేదు. తానొచ్చి విచారిస్తానని చెప్పి బాధితులను పంపించేసింది. బాధితులు అర్ధరాత్రి వరకూ ఎదురుచూసినా వెళ్లలేదు. దీంతో వాళ్లంతా రాత్రి 1.30 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లారు. ఇక తప్పదనుకుని ఆమె సంఘటన స్థలానికి వెళ్లి నిందితుడితో మాట్లాడి వచ్చేశారు. తర్వాత నుంచీ ఆమె మాట మరింత ఘాటైంది. ‘మీరు మూడో అంతస్తులో ఉంటున్నారు.. రోడ్డుమీద జరిగేవి మీకెందుకు? అయినా తాగుబోతులకు దూరంగా ఉంటే మంచిది. అనవసరంగా గొడవలెందుకు’ అంటూ వారిని భయపెట్టడం మొదలుపెట్టారు. కాదూ కూడదంటే బాధితులపై నిందితుడు కూడా ఎదురు కేసు పెడతానంటున్నాడంటూ బెదిరించినట్టు మాట్లాడారు.
దీంతో చేసేది లేక బాధితులు వెనుదిరిగారు. ఈ విషయం ‘సాక్షి’ దృష్టికి రావడంతో ఏఎస్‌ఐ జ్యోతిని వివరణ కోరగా ఇరు వర్గాలనూ కోర్టుకు పంపించేస్తామని, కోర్టు చుట్టూ తిరుగుతారని సమాధానమిచ్చారు. బాధితులు తనను తప్పుపడుతున్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పుకొచ్చారు. బాధితులు ఒత్తిడి చేయడంతో ఎట్టకేలకు నిందితుడిపై సీఐ చంద్రశేఖర్ న్యూసెన్స్ కేసు నమోదు చేయించారు. ఇకపై ఏ రకంగానూ బాధితులను ఇబ్బంది పెట్టనని నిందితుడితో హామీ పత్రం రాయించుకున్నారు. ఇదిలా ఉంటే..ఏఎస్‌ఐ జ్యోతి తీరుపై గతంలోనూ ఆరోపణలున్నాయి. ఆమె ఏ స్టేషన్‌లో పనిచేసినా బాధితులతో అనుచితంగా ప్రవర్తించేవారనే పేరుంది.