ముదిరిన ఉద్యోగినుల వివాదం
ఆందోళనకు దిగిన దళిత సంఘ నాయకులు
ధవళేశ్వరంలో ఇరిగేషన్ కార్యాలయాలు మూసివేత
ధవళేశ్వరం: ఇరిగేషన్‌శాఖలో ఉద్యోగినుల మధ్య నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. దళిత ఉద్యోగినికి అన్యాయం జరిగిందంటూ దళిత ఉద్యోగులు, దళిత సంఘ నాయకులు ఆందోళనకు దిగడంతో శనివారం ధవళేశ్వరంలోని ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ధవళేశ్వరం తూర్పు డివిజన్ కార్యాలయంలో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సునీతకు, జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వాసుదేవికి మధ్య గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై గతంలో కార్యాలయంలో రాజీ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయి నావివాదం మరింత ముదిరింది. ఇటీవల ధవళేశ్వరంలోని తల్లి ఇంటికి వెళ్తున్న వాసుదేవిపై బైక్‌పై వచ్చిన కొందరు దాడి చేశారు. సునీత వర్గీయులే తనపై దాడి చేశారని ఈ నెల 17న వాసుదేవి సునీత, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ధవళేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. అయితే నేటి వరకూ వాసుదేవికి న్యాయం జరగ లేదంటూ దళిత ఉద్యోగులు, దళిత సంఘ నాయకులు శనివారం పెద్ద ఎత్తున తరలి వచ్చి ధవళేశ్వరం తూర్పు డివిజన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయంలో దళిత ఉద్యోగికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని డివిజన్ ఈఈ అప్పలనాయుడిని నిలదీశారు. మరో ఉద్యోగి కుమారుడి ఆలనపాలన చూసుకోవాలని దళిత ఉద్యోగికి అప్పగిస్తున్నారంటే దళితులపై వివక్ష ఏమిటో అర్థమవుతుందని దళిత నాయకులు విప్పర్తి ఫణి,తలారి వరప్రసాద్, దేవదాసి రాంబాబు, గుర్రాల వెంకట్రావు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఈఈ మాట్లాడుతూ ఘటనపై సునీతను వివరణ కోరామని, ఆమె నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పారు. తనకు ఉద్యోగులందరూ సమానమేనన్నారు. దళిత నాయకుల ఆందోళనతో ఇరిగేషన్ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. ఆందోళనలో దళిత నాయకులు జంగా శ్యామ్, తలారి మూర్తి, దేవదాసి రమేష్, మురళి, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.