ఇసుక లారీలపై నియంత్రణేది?
► ఓవర్‌లోడ్‌తోవెళ్తున్న వాహనాలు
► లైసెన్సులు లేకుండా నడుపుతున్న డ్రైవర్లు
► పెరుగుతున్న ప్రమాదాలు
► మహారాష్ట్ర క్వారీల నిర్వాకం
బాన్సువాడ: మహారాష్ట్రలోని ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుకను నింపి రాష్ట్ర రాజధానికి తరలిస్తున్నారు. భారీ వాహనాల్లో వస్తున్న ఇసుక బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, మెదక్ మీదుగా హైదరాబాద్‌కు వెళ్తోంది. నియంత్రణ లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇసుకను తరలిస్తుండగా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఏస్గీ, గంజ్‌గాం క్వారీల్లో ఇసుకను నింపుతున్నారు. ప్రతీరోజు 100 నుంచి 200 భారీ వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక లారీలు వేంగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఇసుకను తరలిస్తున్న కాంట్రాక్టర్లు హెచ్‌ఎంబీ(హైదరాబాద్–మెదక్–బోధన్) రోడ్డును వినియోగిస్తున్నారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్ లేకపోవడంతో రోజూ వందల సంఖ్యలో లారీలు వెళ్తున్నాయి. ఆయా పట్టణాల మీదుగా భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు పూర్తిగా చెడిపోతున్నాయని, రోడ్లను మరమ్మతు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇబ్బందులెదురవుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. నెల రోజులుగా రోజూ వందల సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు.
ఇసుక రవాణా వల్ల తమకు తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయని, దుమ్ము, ధూళితో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక లారీలను అడ్డుకొని, అక్రమ రవాణాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. ఓవర్‌లోడ్ వాహనాలతో రోడ్లు చెడిపోవడంతోపాటు ప్రాణాలు సైతం గాలిలో కలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
లైసెన్సు లేకుండా డ్రైవింగ్
ఇసుక లారీలను నడుపుతున్న వ్యక్తులకు కనీసం డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవల బాన్సువాడ పోలీసులు 7 భారీ లారీలను సీజ్ చేశారు. ఆ లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్లడంతోపాటు నలుగురు డ్రైవర్లకు కనీసం డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. భారీ వాహనాలను నడుపుతున్న వీరికి డ్రైవింగ్ లైసెన్సు కూడా లేకపోవడంతో పోలీసులే విస్మయానికి గురయ్యారు. వెంటనే లారీను కామారెడ్డిలోని ఎంవీఐ కార్యాలయానికి తరలించారు.
ఇసుక లారీలతో సంభవించిన ప్రమాదాలు
గతేడాది వర్ని మండలం అక్బర్‌నగర్‌లో ఇసుక లారీ ఢీకొని జాబేర్(19) అనే యువకుడు మృతి చెందాడు. అలా గే నిజాంసాగర్ మండలం కొమలంచ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇసుక లారీ కింద పడి ఒక వ్యక్తి మతి చెందా డు. బాన్సువాడ పట్టణంలో ఇసుక లారీ ఢీకొని సాయిలు అనే వ్యక్తి మృతి చెందాడు. ఇదే మండలంలోని మొగులాన్‌పల్లి శివారులో రాంనారాయణ్ అనే బాలుడిని ఇసుక లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు.
ఆర్టీఏ, పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోకపోవడంతో అమాయకుల ప్రాణా లు గాలిలో కలుస్తున్నాయి. డ్రైవర్లు అతివేగంగా, అజాగ్రత్తగా లారీలను నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరిపై పోలీసుల పర్యవేక్షణ కరువైంది. ఈ వాహనాలతో ప్రధాన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఒక్కొక్క భారీ వాహనంలో 30 నుంచి 40 టన్నుల ఇసుకను తరలిస్త్ను్న ఇసుక వ్యాపారులు వాటిని హైదరాబాద్ నగరానికి తరలించి సుమారు రూ.50 నుంచి రూ.60వేలకు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క లారీ ద్వారా సుమారు రూ.20 నుంచి రూ.30వేల ఆదాయం వస్తుండడంతో యథేచ్ఛగా ఇసుక లారీలను ఓవర్‌లోడ్ ద్వారా రవాణా చేస్తున్నారు.