మళ్లీ ఉగ్రజాడలు
► హైదరాబాద్‌లో ఆరుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు
► వారిలో కరీంనగర్ కశ్మీర్‌గడ్డకు చెందిన యువకుడు
► జిల్లాలో 92 మంది స్లిపర్‌సెల్స్ ఉన్నట్లు అనుమానాలు
► చొప్పదండి ఎస్‌బీఐ దోపిడీ కేసుతో సంచలనం
కరీంనగర్ క్రైం : జిల్లాలో ఉగ్రజాడలు 1999లో బయటపడగా... అప్పటి నుంచి దేశంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా చాలాసార్లు కరీంనగర్ జిల్లాకు లింక్ ఉంటోంది. తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల బాంబు పేలుళ్లు, విధ్వంసానికి ప్రణాళిక వేసిన ఆరుగురు ఐసిఎస్ స్లీపర్ సెల్స్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. వీరిలో కరీంనగర్‌లోని కశ్మీర్‌గడ్డకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ కూడా ఉన్నట్లు వారు ప్రకటించారు. హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న ఇర్ఫాన్ 2014లో ఇంటినుంచి వెళ్లిపోయాడు. అప్పట్లో తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదంటూ కరీంనగర్ టుటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో కొంతమంది యువకులు ఐసిస్‌లో చేరడానికి వెళ్తూ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత బలగాలకు చిక్కిగా, వారిని ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి, కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్లు సమా చారం. వీరిలో ఇర్ఫాన్ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తర్వాత సదరు యువకుల కదలికలను పెద్దగా పట్టించుకోని పోలీసులు.. ఇటీవల పక్కా సమాచారం రావడంతో నిఘా పెట్టారు. పలుచోట్ల బాంబుపేలుళ్లు, విధ్వంసానికి ప్రణాళికలు వేసిన ఆరుగురిని పట్టుకున్నారు. అయితే ఇర్ఫాన్ తండ్రి మాత్రం తమ కుమారుడు రెండేళ్ల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయూడని, ఇంతవరకు ఆచూకీ తెలియదని అంటున్నాడు.
92 మంది స్లీపర్ సెల్స్..?
జిల్లాలో వివిధ ఉగ్రవాద సంస్థలు సుమారు 92 మంది స్లీపర్ సెల్స్‌ను తయారు చేసుకున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే ఎన్‌ఐఏ అధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. తాజాగా పేలుళ్లు, విధ్వంసానికి పథక రచన చేసిన ఉగ్రవాద ముఠాలో కరీంనగర్ పేరు వినిపించడంపై పలువురు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సంఘట జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్న పోలీసులు.. ఉగ్ర మూలాలను అణచేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.
సంచలనం సృష్టించిన చొప్పదండి బ్యాంక్ కేసు
చొప్పదండి ఎస్‌బీఐలో 2014 ఫిబ్రవరి 1న జరిగిన దోపిడీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు మారణాయుధాలతో బ్యాంకు లోపలికి ప్రవేశించి సిబ్బందిని బెదిరిం చి, రూ.46 లక్షలు దోచుకెళ్లారు. మొదట ఇది దొంగలముఠా పని అని అనుమానించిన పోలీసులు ఎలాంటి ఆనవాళ్లను కనిపెట్టలేకపోయూరు. 2014 అక్టోబర్ 2న పశ్చిమబెంగాల్‌లోని బుర్ధ్వాన్ సమీపం లో జరిగిన పేలుడులో ఓ ఉగ్రవాది చనిపోగా, మరి కొందరు గాయపడ్డారు. అప్పుడక్కడ చొప్పదండి బ్యాంక్ లేబుళ్లు ఉన్న రూ.7.74 లక్షల నోట్లను కట్టలను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. దీంతో బ్యాంక్ చోరీ ఉగ్రవాదుల పనేనని పసిగట్టిన ఎన్‌ఐఏ ఆ దిశగా విచారణ చేపట్టింది. ఇందులో ఇద్దరు గతేడాది ఏప్రిల్ 4న నల్గొండ జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సహకారం లేకుండా దోపిడీకి పాల్పడటం సాధ్యం కాదనే వాదనలున్నారుు. కానీ పోలీసులు ఒక్క అనుమానితుడిని కూడా గుర్తించకపోవడం గమనార్హం.
ఆజంఘోరీతో మొదలు...
ఐఎస్‌ఐ కమాండర్ ఆజంఘోరీ జగిత్యాల కేంద్రం గా కార్యకలాపాలు సాగించడం అప్పట్లో సంచనం సృష్టించింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆజంఘోరీ 1999 డిసెంబర్‌లో ఖిల్లాగడ్డలో ఓ గదిని అద్దెకు తీసుకుని సైకిల్‌పై దువ్వెనలు, పౌడర్లు అమ్ముకుంటూ ఐఎస్‌ఐ కార్యకలాపాలు నిర్వహించాడు. 2000 ఫిబ్రవరి 7న మెట్‌పల్లిలోని వెంకటేశ్వర థియేటర్‌లో ప్రయోగత్మాకంగా బాంబ్ పేల్చాడు. ఇదే తరహాలో నిజామాబాద్, నిర్మల్, హైదారాబాద్, ఆదిలాబాద్ లో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లను నిశితంగా పరి శీలించిన అప్పటి నిజామాబాద్ ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్(ప్రస్తుతం ఎన్‌ఐఏ చీఫ్) ఆజంఘోరీ కదిలికపై నిఘాపెట్టి పట్టుకునే ప్రయత్నంలో జగిత్యాల పాతబస్టాండ్ ప్రాంతంలో 2000 ఏప్రిల్ 5న జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతడిని మట్టుబెట్టారు.
జిల్లాలో పలు సంఘటనలు
► కరీంనగర్ బస్టాండ్‌లో 2005 ఆగస్టు 9వ తేదీన టిఫిన్‌బాక్స్ బాంబ్ పేలి 26 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
► 2006 సెప్టెంబర్11న బస్టాండ్‌లోనే మరో బాంబ్ పేల్చారు. ఈ రెండు కేసులకు బాధ్యులు ఏవరనేది ఇంతవరకూ పోలీసులు తేల్చలేదు. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు.
► లష్కర్ ఇ తోరుుబాతో సంబంధాలున్న హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇజాజ్‌ను దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబుపేలుడు జరిగిన కొద్ది రోజులకే కరీంనగర్ శివారు రేకుర్తి సమీపంలో 2002 నవంబర్ 24న ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
► 2007 హైదరాబాద్‌లోని మక్కా మసీద్ పేలుళ్లలో సంబంధం ఉన్న గోదావరిఖనికి చెందిన ఓ యువకుడిని అరెస్టు చేశారు.
► 2008లో తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలో కరుడుగట్టిన దొంగలున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా క్వార్టర్‌లో ఉంటున్న వారు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు దొంగలు చనిపోయారు. సిమీతో వీరికి సంబంధాలున్నాయని గుర్తించారు.
► 2010లో హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయం ఎదుట బాంబు పేలుడు జరుగగా దాని సూత్రధారి వికారుద్దీన్ ప్రదాన అనుచరుడు గోదావరిఖని చెందిన సయూద్‌గా గుర్తించి అతడిన్నికూడా అరెస్టు చేశారు.