ఇది మోసకారి ప్రభుత్వం..
♦ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు
♦ రైతు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం రూ.లక్షన్నరేనా?
♦ కుటుంబ పోషణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరా.. ఇదేం న్యాయం?
♦ బాధితుల తరఫున సర్కారుపై న్యాయ పోరాటం చేస్తాం
♦ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘అర్హులకు ప్రభుత్వ పథకాలు అందవు. జన్మభూమి కమిటీల పేరుతో లబ్ధిదారులపై వేటు వేస్తారు. వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబ పోషణకు చిల్లిగవ్వ కూడా ఇవ్వరు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం మరెక్కడా ఉండదు. రాష్ట్రంలో పచ్చి మోసకారి ప్రభుత్వం పాలన చేస్తోంది’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన బుధవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో బిజీబిజీగా గడిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల వివాహం చేసుకున్న మూడు జంటలను ఆశీర్వదించారు. వివిధ కారణాలతో మృతి చెందిన 8 కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వృద్ధులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘ఇది వరకు పింఛన్ వచ్చేది నాయనా.. ఇప్పుడు రావడం లేదు. ఎనిమిదేళ్లు పింఛన్ తీసుకున్నా... జన్మభూమి కమిటీలు వచ్చాక పింఛన్ తొలగించారు’’ అని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ తరుఫున అసెంబ్లీలో పోరాటం చేస్తున్నాం. సిగ్గుమాలిన ప్రభుత్వం అర్హులందరికీ న్యాయం చేయడం లేదు. ఇదే విషయమై మీ తరుఫున న్యాయ పోరాటం చేస్తాం’’ అని ప్రతిపక్ష నేత వారికి అభయమిచ్చారు.
టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు
‘‘పక్కా గృహాల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇప్పటికీ మంజూరు కాలేదు. ఇప్పుడేమో జన్మభూమి కమిటీ సభ్యులు చెబితేనే ఇల్లు ఇస్తారట. వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం చేయాలి సార్’’ అంటూ గండికొవ్వూరు కాలనీ వాసులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మొర పెట్టుకున్నారు. ‘‘అర్హులందరినీ సమానంగా చూడడం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తున్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలి. రాష్ట్రంలో నీతిలేని ప్రభుత్వం పాలన చేస్తోంది’’ అని జగన్ దుయ్యబట్టారు.
రైతు కుటుంబానికి ఆసరా ఏదీ?
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామనడం మినహా ఆచరణలో లేదని జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘సిద్ధారెడ్డిగారిపల్లెలో మోహన్‌రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ.లక్షన్నరే ఇస్తామని ప్రకటించారు. అప్పులు ఇచ్చిన వాళ్లకు రూ.50 వేలు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని అధికారుల వద్దే ఉంచుకున్నారు. పరిహారం కుటుంబ పోషణకు ఆసరాగా ఉండాలి. చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా చేతులు దులుపుకున్నారు. ఇదేం న్యాయం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అండగా నిలిస్తేనే ప్రజల గుండెల్లో పాలకులకు సుస్థిర స్థానం దక్కుతుందన్నారు. బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.ఆయన వెంట కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తదితరులు ఉన్నారు.