పెళ్లికి వేళాయే
Published Tue, Feb 28 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
– పెండ్లి పిలుపునకు వెళ్లి తిరిగి అహోబిలం చేరుకున్న అహోబిలేసుడు
– పూర్ణకుంభంతో స్వాగతం పలికిన గ్రామస్తులు, అర్చకులు, సిబ్బంది
– పూజలు చేసి స్వామి సేదతీర్చిన వేదపండితులు
అహోబిలం(ఆళ్లగడ్డ): తన వివాహామహోత్సవానికి రావాలని భక్తులను పిలిచేందుకు వెళ్లిన అహోబిలేసుడు తిరిగొచ్చారు. దాదాపు 45 రోజుల సాగిన ఈ పర్యటనలో స్వామి ఊరూరా తిరిగి భక్తులకు తన దర్శన భాగ్యం కల్పించాడు. కులమతాలకు అతీతంగా అందరూ తన పెళ్లికి రావాలని ఆహ్వానించి మంగళవారం అహోబిలం చేరుకున్న శ్రీ జ్వాలనృసింహ స్వామి, ప్రహ్లాదవరద స్వాములకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. రుద్రవరం నుంచి అహోబిలం చేరుకుంటున్న పారువేట ఉత్సవ పల్లకికి గ్రామ పొలిమేర వరకు వెళ్లి భాజభజంత్రీలతో స్వామిని దేవస్థానానికి తీసుకు వచ్చారు. స్వామి తిరిగి అహోబిలం వస్తుండటంతో గ్రామ మహిళలు రహదారి వెంట కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేసి తమ భక్తిని చాటుకున్నారు.
భక్తిశ్రద్ధలతో ప్రాయశ్చిత్య హోమం
ఇన్నిరోజులు గ్రామాల్లో సంచరిస్తూ అలసి పోయిన ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాలనృసింహస్వామి, ప్రహ్లాదవరదస్వాములకు వేద పండితులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ముందుగా నవకలశ స్థాపన (108 కలశాలు) తో పంచామృతాభిషేకం నిర్వహించి, అటు తరువాత ప్రాయశ్చిత్య, లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణములతో అలంకరించి ప్రహ్లాద వరద స్వామిని దిగువ అహోబిలంలో కొలువుంచి జ్వాలనృసింహాస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఎగువ అహోబిలం తీసుకెళ్లి కొలువుంచారు.
Advertisement