వామ్మో.. ఇవేం బడులు! | Ivem schools Wham ! | Sakshi
Sakshi News home page

వామ్మో.. ఇవేం బడులు!

Published Thu, Jul 21 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

వామ్మో.. ఇవేం బడులు!

వామ్మో.. ఇవేం బడులు!

  ప్రమాదపుటంచున ప్రభుత్వ పాఠశాల భవనాలు
  కూలడానికి సిద్ధంగా గదులు
  వాన నీటికి తడిసిన గోడలు

పెచ్చులూడుతున్న పైకప్పులు
వానొస్తే బడులకు సెలవే..
   ఆందోళనలో విద్యార్థులు

సర్కార్‌ బడులు అనగానే విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. శిథిల భవనాల్లో తరగతులు నిర్వహిస్తోండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందోనని బెంబేలెత్తిపోతున్నారు. పైగా వర్షాకాలం కావడంతో భవనాలు మరింత ప్రమాదకర పరిస్థితికి చేరుకున్నాయి. వానల కారణంగా గోడలు తడిసి ముద్దయ్యాయి,

భవనం పైకప్పు పెచ్చులూడిపడుతున్నాయి. చిన్నపాటి వానకే తరగతి గదుల్లోకి నీరు చేరుతుంది. అయినప్పటికీ అధికారులు అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. వానొచ్చిన రోజు సెలవు ప్రకటిస్తున్నారు.
జోగిపేట: అందోలు బాలుర ఉన్నత పాఠశాల భవనాన్ని వందేళ్ల క్రితం నిర్మించడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది.

వర్షం కురిస్తే చాలు గదుల పైకప్పుల నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గోడల్లో తడిసిముద్దయ్యాయి. అందులో నుంచి నీరు చిమ్మడంతో గురువారం విద్యార్థులు బయటకు పరుగులు తీశారు.

ఈ పురాతన భవనంలో 8,9,10వ తరగతులను నిర్వహిస్తున్నారు. 200కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మూడు గదులతోపాటు ప్రధానోపాధ్యాయుడి గది, ఒకేషనల్‌ కోర్సు గది, స్టాఫ్‌రూం మొత్తం ఆరు గదులు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షం వచ్చినప్పుడల్లా భయంతో విద్యార్థులను ఇళ్లకు పంపిస్తున్నారు.

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో శిథిల భవనంలో పాఠశాల నిర్వహణ భయాందోళనలకు గురి చేస్తుంది. గదుల పైకప్పులు పగిలి వర్షం నీరు లోపలికి రావడంతో గదుల్లో నీరు నిలవడంతో కూర్చోవడానికి వీలు లేకపోవడంతో పిల్లలు వర్షం కురిసినపుడల్లా ఇంటి ముఖం పడుతున్నారు. నర్సాపూర్‌లోని సెకండ్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది.

ఇందులో తెలుగు, ఉర్దూ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో 244 మంది విద్యార్థులు చదువుతున్నారు. రెండంతస్తుల భవనంలో పైకప్పు రేకుల షెడ్డు ఉన్న భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు.  పైకప్పు రేకులు పగలడంతో వర్షం కురిసినప్పుడల్లా రేకుల రంధ్రాల్లోంచి కిందకు నీరు పడడంతో గదులన్నీ నీటితో నిండిపోతున్నాయి.

బుధవారం రాత్రి కురిసిన వర్షానికి తరగతి గదుల్లో నీరు నిండడంతో పిల్లల్ని ఇంటికి పంపారు. పక్షం రోజుల క్రితం ఈ భవనాన్ని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పరిశీలించారు. అద్దె భవనంలోకి మారాలని హెచ్‌ఎంను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అద్దె రాదని జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చడంతో పురాతన భవనంలోనే కొనసాగిస్తున్నారు. శిథిల భవనంలో తరగతులు నిర్వహించడంపై పాఠశాల విద్యా కమిటీ చైర్‌పర్సన్‌ సంతోష, వైస్‌ చైర్‌పర్సన్‌ నసీంబేగం ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఈ పాఠశాలను ఎంఈఓ జెమిని సందర్శించారు. పాఠశాల దుస్థితిని డీఈఓకు నివేదిస్తానని తెలిపారు.

పాఠశాల భవనానికి పగుళ్లు
శివ్వంపేట: స్థానిక ప్రాథమిక పాఠశాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. పైకప్పుపై చెట్టు పెరుగుతుండడంతో గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. చెట్టు చిన్నగా ఉన్నప్పుడే తొలగించాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం..
పాఠశాల దుస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆరు గదులు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. పిల్లలు కూడా ఈ భవనంలో చదువుకోవడానికి భయపడుతున్నారు. వర్షం కురిస్తే చాలు నీళ్లు గదుల్లోకి వస్తున్నాయి.
– రమేశ్, హెచ్‌ఎం, అందోలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement