జననేత బస చేసే అతిథిగృహం వద్ద ఏర్పాట్లను పరిశీలించి వస్తున్న బుడ్డా శేషారెడ్డి, బీవై రామయ్య తదితరులు
జననేత బస ఏర్పాట్ల పరిశీలన
Published Wed, Jan 4 2017 11:46 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
- ·నేడు శ్రీశైలానికి వైఎస్ జగన్ రాక
·- ముఖ్య అతిథులకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో భోజన సదుపాయాలు
- ఎంపీలు, ఎమ్మెల్యేలకు వీఐపీ అతిథి గృహాలు
శ్రీశైలం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..శ్రీశైలంలో బస చేసే అతిథిగృహాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, నియోజకవర్గ ఇన్‌చార్జి బుడ్డా శేషారెడ్డి బుధవారం పరిశీలించారు. రైతు భరోసా యాత్రలో పాల్గొనడానికి వస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన అతిథులకు కేటాయించిన వీఐపీ వసతిగదుల కాటేజీలను కూడా సందర్శించారు. ఎవరెవరికి ఏయే కాటేజీలను కేటాయించాలో బుడ్డా శేషారెడ్డి ఒక జాబితాను రూపొందించి సంబంధిత ప్రతులను దేవస్థానం వసతి విభాగం అధికారులకు.. ఈఓ నారాయణభరత్ గుప్త సూచనల మేరకు అందజేశారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి .. గురువారం ఉదయం 10గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి లింగాలగట్టుకు చేరుకుని అక్కడ డ్యాంను పరిశీలించి మధ్యాహ్నానికి సున్నిపెంటకు చేరుకుంటారని తెలిపారు. సున్నిపెంటలో జననేతకు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చిన అతిథులందరికీ భోజన సౌకర్యాలు కల్పించడానికి ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో షామియానాలు ఏర్పాటు చేశామన్నారు. సున్నిపెంటలో రోడ్‌షో ముగిసిన తరువాత రాత్రికి ప్రతిపక్షనేత..శ్రీశైలం చేరుకుంటారని తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని విశేషపూజలను నిర్వహించుకున్నాక నేరుగా ఆత్మకూరుకు బయలుదేరి వెళ్తారని స్పష్టం చేశారు. ఆత్మకూరులో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. బుడ్డా శేషారెడ్డి వెంట పార్టీ జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు వైపీ చలమారెడ్డి, నాయకులు కాతా రామిరెడ్డి, అన్నదానం గిరిజా శంకరస్వామి, నాగేశ్వరరావు, మల్లికార్జున తదితరులు ఉన్నారు.
Advertisement