క్షతగాత్రులను పరామర్శిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
- బస్సు ప్రమాద బాధితులకు వై.ఎస్.జగన్ భరోసా
- బాధను విన్నవించుకున్న క్షతగాత్రులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం :
పలు ప్రమాదాల్లో బాధితులను పరామర్శిస్తూ.. నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. జిల్లాలో జరిగిన పలు ప్రమాద ఘటనల్లో మృత్యువాతపడిన వారి కుటుంబాలకు ఆయన ఆప్యాయతాను రాగాలను పంచారు. 2012, మార్చిలో కొత్తగూడెం మండలానికి చెందిన ఎల్.వి.రెడ్డి స్కూల్ బస్సు పెద్దవాగు వద్ద ప్రమాదానికి గురికాగా.. 8 మంది చిన్నారులు మృతిచెందారు. విషయం తెలుసుకున్న జగన్.. చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించేందుకు మార్చి 22న జిల్లాకు వచ్చారు. ఆ ప్రమాదంలో మృతిచెందిన వారంతా చండ్రుగొండ మండలానికి చెందిన చిన్నారులు కావడంతో ఆయన ప్రతి చిన్నారి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను ఓదార్చి.. అక్కున చేర్చుకున్నారు. చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన జగన్‌కు సైతం అదే రీతిన ఆదరణ లభించింది. ఇక దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో మృతిచెందిన పలువురు అభిమానుల కుటుంబాలను ఓదార్చేందుకు సైతం 2010లో ఆయన జిల్లాకు వచ్చారు. పలు ప్రాంతాల్లో మృతిచెందిన వైఎస్‌ఆర్ అభిమానుల కుటుంబాలను పరామర్శించి.. ఓదార్చారు. వారి ఆప్యాయతానురాగాలను జగన్‌పై కురిపించి తమ ఇంటి బిడ్డగా భావించారు.
తాజా ఘటనలోనూ...
కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలోనూ 10 మంది మృతిచెందగా.. 21 మంది గాయాలపాలయ్యారు. సంఘటన విషయం తెలుసుకున్న జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి తొలుత సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న అనంతరం ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. వారిని వివరాలు అడిగి తెలుసుకుంటూ.. గాయాలు ఎక్కడయ్యాయో.. వైద్యం ఎలా అందిస్తున్నారో తెలుసుకుంటూనే వారికి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రతి క్షతగాత్రుడి బెడ్ వద్దకు వెళ్లి వారితోపాటు కూర్చుని.. చెరగని చిరునవ్వుతో పలకరిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తమ వద్దకు వచ్చి స్వయంగా పలకరిస్తూ.. అందరినీ పరామర్శించడంతో క్షతగాత్రులు సైతం తమ బాధను మరిచిపోయి ఆయనకు తమ బాధను విన్నవించుకున్నారు. తమను ఆదుకోవాలని కోరిన క్షతగాత్రులకు అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. సంఘటన గురించి తెలుసుకుని వెంటనే స్పందించి తమ వద్దకు వచ్చి ఓదార్చడం పట్ల బాధితులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.