జల దిగ్బంధం | jaladegbhandam | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధం

Published Sat, Sep 24 2016 12:08 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

జల దిగ్బంధం - Sakshi

జల దిగ్బంధం

సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాలను కుండపోత వర్షం ముంచెత్తింది. వాగులు, కొండకాలువలు పొంగి పొర్లుతున్నాయి. పంటలు నీటమునిగాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఎర్రకాలువ ప్రమాదం అంచున ప్రవహిస్తోంది. ఈ కాలువపై శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపనాల ప్రభావంతో మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, గోపాలపురం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, చింతలపూడి, కుక్కునూరు మండలాల్లోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. గోపాలపురంలో పిచ్చిగండి కాలువ పొంగి దొండపూడి–గోపాలపురం రోడ్డు మీదుగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎర్రకాలువ ఉధృతితో సుమారు వెయ్యి ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో ఆ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు.
 శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి గడచిన 24 గంటల్లో జంగారెడ్డిగూడెంలో రికార్డు స్థాయిలో 14.74 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 12 సెంటీమీటర్లు, కామవరపు కోటలో 10.82, గోపాలపురంలో 10.8, బుట్టాయగూడెంలో 9.22, జీలుగుమిల్లిలో 8.26, కుక్కునూరులో 8.22, పోలవరంలో 9.22, తాళ్లపూడిలో 6.22, చింతలపూడిలో 6.04 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు పడ్డాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జల్లేరు జలాశయంలో నీటిమట్టం పెరిగింది.
 దీని సామర్థ్యం 217.14 మీటర్లు కాగా, ఇప్పటికే 216.08 మీటర్లకు చేరుకుంది. ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 83.5 మీటర్లు సామర్థ్యం గల ఈ జలాశయంలో నీటిమట్టం శుక్రవారం మధ్యాహ్నానికి 81.48 మీటర్లకు చేరింది. ప్రస్తుతం 5,700 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఇదిలావుండగా, చింతలపూడి మండలం ముక్కంపాడులోని చెరువు పంట కాలువలో అదే గ్రామానికి చెందిన రవీందర్‌రెడ్డి, టి.వెంకట కేశవరావు కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. 
పొంగుతున్న వాగులు
వాగులు, కొండకాలువలు పొంగుతుండటంతో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలంలో అనేక గ్రామాల జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంలో తామర చెరువు పొంగి ఎస్సీపేటను ముంచెత్తింది. సుమారు 25 ఇళ్లు వరదబారిన పడ్డాయి. లక్కవరంలో వెదుళ్ల వాగు ఉధతి రాకపోకలు నిలిచిపోయాయి. చిన్నవారిగూడెంలోని పెద్దచెరువు పొంగి చిన్నవారిగూడెం–ఎ.పోలవరం రోడ్డు మీదుగా ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గుర్వాయిగూడెంలో చెరువుకు గండిపడటంతో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. పోలవరం మండలం కొత్తదేవరగొంది సమీపంలోని ఇసుక కాలువకు గండిపడటంతో వరిచేలు నీట మునిగాయి. కొయ్యలగూడెం మండలంలో పులివాగు వద్ద ఉన్న తవ్వుడు కాలువకు గండిపడి వరద నీరు చేలను ముంచెత్తింది. రామానుజపురం–వేదాంతపురం గ్రామల మధ్య కనకరాజు చెరువు కాలువకు గండిపడి వరిచేలు ముంపునకు గురయ్యాయి. దిప్పకాయలపాడు రాజు చెరువు డ్యామ్‌లో వరద నీరు పోటెత్తి దిగువకు ప్రవహిస్తోంది. చెరువు మురుగు తూము వరద ఉధతికి కొట్టుకుపోవడంతో చేలు ముంపుబారిన పడ్డాయి. జీలుగుమిల్లి మండలంలో సంగంవాగు,అశ్వారావుపేట వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎర్రకాలువ పొంగి ప్రవహిస్తోంది. బైనేరు, పులివాగు, కొండవాగుల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎర్ర కాలువ పొంగుతోంది. దీని ఉధతితో తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో వెయ్యి ఎకరాలకు పైగా ఆయకట్టులో వరి చేలు నీట మునిగాయి. నందమూరు పాత ఆక్విడెక్ట్‌ను తొలగించకుండా అధికారులు,  ప్రజాప్రతినిధులు తాత్సారం చేస్తున్నారంటూ ఆక్విడెక్ట్‌ వద్ద రైతుల బైఠాయించారు. దీంతో రెండు గంటలకు పైగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బుట్టాయగూడెం మండలం ఇప్పలపాడు సమీపంలోని జల్లేరు వాగు, పట్టినపాలెం సమీపంలోని వాగు, రెడ్డిగణపవరం వాగు పొంగి పొర్లుతున్నాయి. ముంజులూరు, కన్నారపాడు, కోపల్లి వద్దగల కొవ్వాడ కాలువ వాగులు పొంగాయి. వేలేరుపాడు మండలాన్ని వాన ముంచెత్తింది. జనజీవనం స్తంభించింది. పెదవాగు ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. రెండు గేట్లు ఎత్తివేయటంతో మండలంలోని అనేక గిరిజన గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం ఊటగుంప గ్రామాలు గురువారం సాయంత్రం నుండి జలదిగ్బంధంలో  చిక్కుకున్నాయి.
విద్యుత్‌ శాఖ అప్రమత్తం
కొవ్వూరు:గడచిన నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్‌ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్టు చేసేందుకు సిద్ధమయ్యారు. 500 ట్రాన్స్‌ఫార్మర్లు, 400 విద్యుత్‌ స్తంభాలు, 30 కిలోమీటర్ల విద్యుత్‌ వైర్లను సిద్ధం చేసినట్టు ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సీహెచ్‌.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏలూరులో సర్కిల్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. స్తంభాలు కూలిపోవడం, వాలడం, తీగలు తెగడం వంటి పరిస్థితులు ఎదురైతే చక్కదిద్దేందుకు 21 బందాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. ఒక్కొక్క బందంలో 15 చొప్పున మొత్తం 315 మంది కార్మికుల్ని  సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం గాలుల తీవ్రత అంతా లేకపోయినప్పటికీ వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత సమస్యలు బయటపడుతుంటాయన్నారు.
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement