జన్మభూమి సభల్లో జనాగ్రహం
జన్మభూమి సభల్లో జనాగ్రహం
Published Mon, Jan 9 2017 11:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జన్మభూమి గ్రామ సభల్లో జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజల నుంచి గతంలో వచ్చిన విన్నపాలను పరిష్కరించకుండా.. కొత్తగా సమస్యలు తెలుసుకుంటామంటూ గ్రామసభలు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులపై జనం తిరగబడుతున్నారు. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భయం భయంగా జన్మభూమి సభల్లో పాల్గొంటున్నారు. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం నిరసనలు వ్యక్తమయ్యాయి. నరసాపురం మండలం వేములదీవిలో ఏపీ రైతు సంఘం నాయకులు కవురు పెద్దిరాజు, ఎం.రామాంజనేయులు తదితరులు ఆందోళనకు దిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంటపాటు సమావేశం నిలిచిపోయింది. కొవ్వూరు మండలం వాడపల్లిలో 90 ఏళ్ల ఎల్లా వీరమ్మ అనే అంధురాలు నడవలేని స్థితిలో కుటుంబ సభ్యుల సహాయంతో జన్మభూమి సభకు వచ్చింది. తనకు 8 నెలలుగా పింఛను సొమ్ము ఇవ్వడం లేదని వాపోయింది. మద్దూరులో పింఛన్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, పారిశుద్ధ్యం పడకేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను, ప్రజాప్రతినిధులను గ్రామస్తులు నిలదీశారు. కొవ్వూరు పట్టణంలో నిర్వహించిన సభలో పింఛన్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిడదవోలులో జరిగిన కార్యక్రమంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇచ్చారని.. గత మూడు జన్మభూమి సభల్లో అర్జీలు ఇచ్చిన వారికి ఎందుకు మంజూరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోపాలపురం నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన సభల్లో రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలపై అధికారులను ప్రశ్నించగా, సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడ్డారు. దేవరపల్లి మండలం యాదవోలు, కురుకూరు గ్రామాల్లో జరిగిన సభల్లో పింఛన్లు, ఇంటిస్థలాల కోసం దరఖాస్తులు అందజేశారు.
Advertisement
Advertisement