
మహనీయుల ఆశయసాధనకు జాతర కమిటీలు
జడ్చర్ల టౌన్: బహుజనుల హక్కుల సాధనకు పాటుపడిన సాహు మహరాజ్, జ్యోతిరావుపూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పెరియార్ లాంటి మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అంబేద్కర్ జాతర కమిటీలు వేయనున్నామని మహబూబ్‌నగర్ అంబేద్కర్ జాతర కమిటీ సీనియర్ నాయకులు సుధాకర్ అన్నారు. ఆదివారం జడ్చర్ల ప్రభుత్వ అతిథి గృహంలో మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాల అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులకు వివరాలను వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో అంబేద్కర్ జాతర కమిటీ ఏర్పాటు చేసి 18 ఏళ్లవుతుందని, ఇకపై తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కమిటీలు వేయాలని నిర్ణయించామన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలంటే మహనీయుల గూర్చి వివరిస్తూ వారి ఆశయాలు, లక్ష్యాలు గ్రామ గ్రామానికి చేరవేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. అక్టోబర్ 14న అంబేద్కర్ బౌద్ధమతం స్వీకరించిన రోజు కావడంతో ఆ రోజు వరకు రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు పూర్తిచేస్తామన్నారు. తర్వాత హైదరాబాద్ నిజాం గ్రౌండ్‌లో భారీ జాతర నిర్వహిస్తామని, ఇందుకోసం చేయాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. జాతర కమిటీల అధ్యక్షులు శంకర్, రామచందర్, రహ్మన్, బలరాం, నాయకులు విజయ్‌కుమార్, ఆనంద్, చంద్రమోహన్, శేఖర్ పాల్గొన్నారు.