ప్రాచీన హోదాను ఖూనీ చేస్తున్నారు
ప్రాచీన హోదాను ఖూనీ చేస్తున్నారు
Published Sun, Jul 2 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
భాషను పట్టించుకోని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు
తెలుగు సాహిత్యంపై రాష్ట్ర విభజన ప్రభావం
ప్రముఖ కవి ఆచార్య జయధీర్ తిరుమలరావు
రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర విభజన ప్రభావం తెలుగు సాహిత్యంపై స్పష్టంగా కనిపిస్తోందని ప్రముఖ కవి, విమర్శకుడు, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం, పరిశోధనా సంస్థల విశ్రాంత సంచాలకుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాఠకులు కూడా వేరయ్యారని చెప్పారు. పురమందిరంలో ఆదివారం నిర్వహించిన సినారె సంస్మరణ సభలో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకం మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగ సాహిత్యం పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. ఆయన మాటల్లోనే...
ప్రభుత్వాల అసమర్ధతకు పరాకాష్ట
కేంద్రం తెలుగు భాషకు ప్రాచీన హోదా ఇచ్చినా... రెండు తెలుగు రాష్ట్రాలు కలసి ఈ హోదాను చంపేస్తున్నాయి. ఈ విషయం చెప్పడానికి మొహమాటం అవసరం లేదు. పరిశోధనలకు నిధులు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. కేంద్రం నుంచి తెచ్చుకోవడంలో శ్రద్ధ తీసుకోరు. మైసూర్‌లో ఉన్న భారతీయ భాషల అధ్యయన కేంద్రంలో ఉన్న మన తెలుగు విభాగాన్ని సొంత గడ్డపైకి తెచ్చుకునేందుకు ఎవరూ ప్రయత్నం చేయడం లేదు. మన పొరుగున ఉన్న తమిళనాడు ప్రభుత్వం ఏనాడో తమ తమిళ విభాగాన్ని అక్కడి నుంచి తమ సొంత రాష్ట్రానికి తీసుకుపోయింది. మన భాషను మనం కాపాడుకోవాలి... అభివృద్ధి చేసుకోవాలి... కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడం విచారకరం.
విభజన ప్రభావం సుస్పష్టం
తెలంగాణ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలు ఇక్కడికి చేరడం లేదు. పత్రికలు, ప్రచురణకర్తలు విడిపోయారు. ప్రముఖుల రచనలు మినహాయించి, ఒక ప్రాంతంలో అచ్చయ్యే పుస్తకాలు మరో చోట లభ్యం కావడం లేదు. అటు తెలంగాణలో నవకేతన్, నవ తెలంగాణ, ఇటు ఆంధ్రాలో ప్రజాశక్తి, విశాలాంధ్ర సంస్థలు చాలా వరకూ ఆయా ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి.
సినారె అందరి వాడు
డాక్టర్ సి.నారాయణరెడ్డి అంతిమ యాత్రలో పాల్గొనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి రెండు బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఆయన పార్ధివ శరీరం వద్ద ఆ రోజు ఉదయం నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మరి కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ పరిశ్రమకు చెందినవారు ఉన్నారు. మహాకవి అంతిమ ప్రస్థానంలో రాజకీయాలు చూడొద్దు. సినారె అందరి వాడు. ఆయనకు అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులు ఉన్నారు.
పూర్వ వైభవం సంతరించుకోవాలంటే...
నేను బొమ్మూరులోని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్యపీఠానికి ఇన్‌చార్జి డీన్‌గా పనిచేశాను. ఈ రోజున సాహిత్యపీఠం పూర్వవైభవం తిరిగి సంతరించుకోవాలంటే గట్టి రాజకీయ సంకల్పం కావాలి. ప్రజల నుంచి ఆందోళనలు వ్యక్తం కావాలి. అవి తగిన స్థాయిలో వ్యక్తం కావడంలేదు.
కొన్ని సంస్థలు ఉమ్మడి జాబితాలో ఉంటేనే మేలు
ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారం పరిశోధనా సంస్థ వంటివి ఉమ్మడి జాబితాలో ఉంటేనే భాషాసాహిత్యాలకు మేలు జరుగుతుంది. ఈ సంస్థ నిర్వహించే తాళపత్రాల సేకరణ, అధ్యయనం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడిగా జరిగితే మంచిది. ఈ విషయంలో వేరుకుంపట్లు అనవసరం.
Advertisement
Advertisement