
గృహ నిర్బంధంలో జయశ్రీ
ప్రొద్దుటూరు క్రైం: ఏ సంఘటన జరిగినా ఆమెను గృహ నిర్బంధం చేయండం పోలీసులకు పరిపాటిగా మారింది. మానవహక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీని గండికోట ముంపు గ్రామాల విషయమై పలు మార్లు గృహ నిర్బంధం చేశారు. ఆమె ముంపు వాసుల తరపున జలదీక్షతోపాటు అనేక పోరాటాలు చేశారు. పోలీసులు గృహ నిర్బంధం చేసినా వారి కళ్లు కప్పి అర్ధరాత్రి సమయంలో చౌటపల్లెకు వెళ్లారు. ఆయా గ్రామ ప్రజల ఆందోళనలతోపాటు జయశ్రీలాంటి ఉద్యమ నాయకుల ఫలితంగా ముంపు గ్రామాలకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. ఈక్రమంలోనే బుధవారం ముగ్గురు పోలీసులు జయశ్రీ ఇంటి వద్దకు వచ్చి గృహ నిర్బంధం చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు చేస్తారని ఆమె ప్రశ్నించగా పోలీసులు సమాధానం చెప్పలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చామని వారు చెప్పారు. రెండు రోజుల క్రితం ఆమె చౌటపల్లెతోపాటు పలు ముంపు గ్రామాలకు వెళ్లి పరిహారం అందని వారితో మాట్లాడారు. వారికి ఎందుకు చెక్కులు ఇవ్వలేదన్న విషయంపై అధికారులతో చర్చించారు. చౌటపల్లె గ్రామంలో ఎంతో పవిత్రంగా, వైభవంగా లింగమయ్య తిరుణాలను జరుపుకొంటారు. ముంపు నీరు రావడంతో ఇప్పటికే గ్రామస్తులు ఇళ్లు వదలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా బుధ, గురువారాల్లో పండుగను వైభవంగా నిర్వహించడానికి గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసు అధికారులు పండుగ నిర్వహించకుండా ఆటంకం కలిగించేందుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులతో సమాచారం మేరకు జయశ్రీ విద్యుత్ అధికారులతో మాట్లాడి తిరిగి గ్రామానికి విద్యుత్ సరఫరా చేయించారు. ముంపు గ్రామాల్లో ఎలాంటి సమస్య లేదని అయినప్పటికీ తనను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని జయశ్రీ తెలిపారు.
అసలు కారణం ఇదే...
జయశ్రీని పోలీసులు గృహ నిర్బంధం ఎందుకు చేశారో బుధవారం సాయంత్రానికి తెలిసింది. పైడిపాలెం ప్రాజెక్టు కింద ఉన్న తొండూరు రైతులు ఆమెకు ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు పైడిపాలెం ప్రాజెక్టు కింద మొదటగా వచ్చే ఊరు తొండూరు. అయితే ఆ గ్రామానికి నీరు ఇవ్వకుండా దిగువ ప్రాంతంలో ఉన్న ఇతర గ్రామాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు జిల్లా అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేదు. ఈ క్రమంలోనే పైడిపాలెం ప్రాజెక్టు వద్ద తొండూరు, దిగువ ప్రాంత రైతులు ఘర్షణ పడ్డారు. బుధవారం ప్రాజెక్టు వద్ద రైతులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి జయశ్రీ వెళతారేమోనని భావించిన పోలీసులు ముందస్తుగా ఆమెను గృహ నిర్బంధం చేశారు.