వాడపల్లి తీర్థాన్ని విజయవంతం చేయాలి
వాడపల్లి తీర్థాన్ని విజయవంతం చేయాలి
Published Fri, Mar 24 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM
- వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలపై సమీక్షలో జేసీ
వాడపల్లి (ఆత్రేయపురం) : కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. వాడపల్లి తీర్థం ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ కరుటూరి నరసింహరావు అధ్యక్షతన వెంకన్న సన్నిధిలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన, అమలాపురం ఆర్‌డీఓ జి.గణేష్‌కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచీ వేలాదిగా భక్తులు తరలిరానున్న దృష్ట్యా వివిధ శాఖల అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉత్సవాలు కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ ఏడాది స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యుత్ తీగలు తగలకుండా, రహదారులు కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత ఇంజినీర్లతో సమీక్షించారు. రహదార్లకు ఎటువంటి ఇబ్బందీ లేదని వారు తెలిపారు. రథానికి విద్యుత్ తీగలు తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఏడీఈ డేవిడ్ తెలిపారు. 30 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తున్నామని డీఎల్‌పీఓ జెవీవీవీఎస్ శర్మ చెప్పారు. 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నామని వైద్యాధికారులు శ్రీనివాసవర్మ, ఝున్సీ వివరించారు. అమలాపురం డీఎస్‌పీ అంకయ్య పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు తెలిపారు.
జేసీ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి ఎండల నేపథ్యంలో చలువ పందిళ్లు వేయాలని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తుల దాహార్తి తీర్చాలని సూచించారు. ఈ నెలాఖరుకు అన్ని పనులూ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం కళ్యాణోత్సవాల పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణాధికారి బీహెచ్‌వీ రమణమూర్తి సమావేశంలో వివరించారు.
అనంతరం జేసీ, ఆర్‌డీఓలు స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వారికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కరుటూరి నరసింహరావు జేసీ, ఆర్‌డీఓలకు స్వామివారి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్రిపోతు విమల, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, తహసీల్దార్ వరదా సుబ్బారావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ ప్రసాద్, ఈఓ పీఆర్‌డీ డీవై నారాయణ, జేఈలు రంగనాయకులు, మణికుమార్, వీరభద్రరాజు, కృష్ణమూర్తి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement