పంటల సాగుకు భరోసా
► ఎకరానికి రూ.4వేలు అందజేస్తాం
► గోదాముల నిర్మాణానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం
► అటవీశాఖ మంత్రి జోగు రామన్న
► ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ ప్రారంభం
ఆదిలాబాద్‌రూరల్: రైతులు బాగుండాలని పంటల సాగుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, ఆర్థికంగా బలోపేతం కావడానికి వచ్చే సంవత్సరం ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని యాపల్‌గూడ గ్రామంలో ‘మన తెలంగాణ–మన వ్యవసాయం’ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని చెప్పారు. రైతులు పండించిన పంటలు గోదాముల్లో నిల్వ చేసుకోవడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.150 కోట్ల వ్యయంతో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 45 గోదాములు నిర్మించామని తెలిపారు. పశువులకు నాణ్యమైన వైద్య చికిత్స సకాంలో అందించాలనే ఉద్దేశంతో ఆస్పత్రుల్లో అవసరమైన మందులు సమకూరుస్తోందని వివరించారు. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేస్తున్నామని, గీత, బీడీ, చేనేత కార్మికల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
కులవృత్తుల పరిరక్షణ కోసం సబ్సిడీపై రుణాలు అందజేసి ఆదుకుంటున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పట్టు పరిశ్రమ ద్వారా 40 రోజుల్లోనే రూ.1.50 లక్షల ఆదాయం పొందవచ్చని సూచించారు. రైతులకు సబ్సిడీపై డ్రిప్, స్ప్రింక్లర్లను అందజేస్తున్నామని, పాలిహౌస్ ద్వారా పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా యాపల్‌గూడలో రూ.కోటితో సీసీ రోడ్లు, రూ.20 లక్షల వ్యయంతో మురికి కాలువలను నిర్మించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశకుమారి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, యాపల్‌గూడ, మావల సర్పంచ్‌లు కొడప ఇస్రూబాయి, ఉష్కం రఘుపతి, రైతులు పాల్గొన్నారు.