న్యాయమూర్తి ఫిర్యాదుపై న్యాయమిదేనా..? | judge on the complaint ..? | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తి ఫిర్యాదుపై న్యాయమిదేనా..?

Published Mon, Mar 6 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:17 AM

న్యాయమూర్తి ఫిర్యాదుపై న్యాయమిదేనా..?

న్యాయమూర్తి ఫిర్యాదుపై న్యాయమిదేనా..?

అటకెక్కిన లంచం కేసు
రెండు నెలలైనా పట్టించుకోని పోలీసులు


పుంగనూరు : న్యాయానికి న్యాయం కరువైన ఉదంతమిది. పోలీసుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. పుంగనూరు క్రిమినల్‌ కోర్టుకు ఒక వ్యక్తి జనవరి నెల 9న కొరియర్‌ ద్వారా రూ.2 వేలు  లంచం పంపించాడు. జడ్జి ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు నెలలైనా దర్యాప్తు ముందుకు సాగలేదు. సాధారణంగా కేసుల్లో నిందితులను పరుగులు పెట్టించే పోలీసులు సంచలనం రేకెత్తించిన కేసును పరిశోధించకుండా వదిలివేయడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 8న కొరియర్‌ ద్వారా పంపిన సీల్డ్‌ కవర్‌ పుంగనూరు క్రిమినల్‌ కోర్టుకు 9న అందింది. దీనిని తీసుకున్న కోర్టు ఉద్యోగి ఆర్‌.వెంకట్రమణ న్యాయమూర్తి భారతి సమక్షంలో కవర్‌ను పరిశీలించారు.

అందులో రూ.2 వేలు నోటు (నెంబరు: 4జి 254018) ఉంది. అలాగే లేఖ కూడా ఉంది. పుంగనూరు కోర్టులో ఉన్న సీఎఫ్‌ఆర్‌ కేసులన్నీ ఎత్తివేయాలని కోరుతూ పి.భవాని, కఠారు మణి, తాటిమాకులపాళ్యెం సంతకాలు చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి భారతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.   ఆయన అనుమతి మేరకు జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పుంగనూరు పోలీసులు జనవరి 17న క్రైౖమ్‌ నెంబరు 11/2017గా కేసు నమోదు చేశారు. ఇందులో 1వ నిందితురాలిగా భవానిని, రెండవ నిందితుడిగా కె.మణిని చూపుతూ సెక్షన్‌ 182, 417 కింద కేసు నమోదు చేశారు. అంతవరకు వేగవంతంగా సాగిన దర్యాప్తు తర్వాత ఆగిపోయింది. పుంగనూరు కోర్టులో భవాని అనే మహిళ ఐపీ దాఖలు చేసింది. ఈ సమయంలో కఠారి మణి అనే వ్యక్తికి రూ.10 లక్షలు బకాయిలు ఉండడంతో ఆయన భవానిపై కోర్టులో కేసు దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపి, భవానికి చెందిన ఇంటిని కఠారి మణికి రిజిస్ట్రేషన్‌ చేసి స్వాధీన పరిచింది. ఇలా ఉండగా అదే ఇంటిని 2012 నవంబర్‌ 8న రూ.6.50 లక్షలకు పి.సునీల్‌కుమార్‌ అనే వ్యక్తికి భవాని పాత తేదీన విక్రయ అగ్రిమెంటు చేసినట్లు పి.సునీల్‌కుమార్‌ పుంగనూరు కోర్టులో కేసు దాఖలు చేశారు.

ఆ కేసు విచారణలో ఉంది. ఇలా ఉండగా భవానిపై సునీల్‌కుమార్‌ చెక్కు కేసులను దాఖలు చేశారు. అవి కూడా విచారణలో ఉన్నాయి. ఈ సమయంలో న్యాయమూర్తికి లంచం పంపుతూ భవాని, కఠారిమణి రాసినట్లుగా లేఖ రాయడం వివాదాలకు దారి తీస్తోంది. కావాలనే ఈ రెండు కేసులకు చెందిన వ్యక్తులే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చారని, ఇతరులకు ఎలాంటి అవసరం ఈ కేసులతో లేదని పలువురు వాపోతున్నారు. నిజాలు నిగ్గుతేల్చాల్సిన పోలీసులు మౌనం దాల్చడం పోలీసుల తీరును వెక్కిరిస్తోంది. దీనిపై ఎస్‌ఐ హరిప్రసాద్‌ను వివరణ కోరగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. లేఖను హైదరాబాదులోని నిపుణులకు పంపామన్నారు. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నిందితులను పట్టుకుంటామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement