సమస్యల సంద్రంలో జూనియర్ కళాశాల
-
మొక్కుబడిగా ప్రిన్సిపాల్ రాక
-
పనిచేయని సీసీ కెమెరాలు
-
ఏర్పాటు కాని బయోమెట్రిక్ పరికరాలు
-
పట్టించుకోని అధికారులు
బెజ్జూర్ : ప్రభుత్వ కళాశాలలో చేరండి నాణ్యమైన విద్యతో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పుకుంటున్న అధికారులకు బెజ్జూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాత్రం అవి కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత చదువులో కోసం కళాశాలలో చేరుతున్న విద్యార్థులకు ఉన్నతమైన చదువులు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కళాశాలల్లో సిబ్బంది పనితీరును మెరుగుపర్చడానికి ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం కళాశాలలో ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. అధ్యాపకులు వేళకు రాకపోవడంతో విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన అందడం లేదని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి కారణం అధ్యాపకులు స్థానికంగా ఉండడకుండా రోజూ కాగజ్‌నగర్ నుంచి రావడమేనని వారు పేర్కొంటున్నారు. ఇక ప్రిన్సిపాల్ తీరే వేరని వారు వాపోతున్నారు. నెలకు ఒక సారి మొక్కుబడిగా కళాశాలకు వస్తున్న ప్రిన్సిపాల్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే కళాశాలలో సమస్యలు అధికమయ్యాని వారు తెలుపుతున్నారు.
సమస్యల చిట్టా
1. పనిచేయని వాటర్ ప్లాంట్
విద్యార్థులకు మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో గత ఏడాది మినరల్ వాటర్ ప్లాంటు చేశారు. ఏర్పాటు చేసి సంవత్సరం కూడా గడవకముందే వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు నెలకొన్నాయి. ప్లాంట్ పనిచేయకపోవడంతో విద్యార్థులకు బోరు నీరు తాగాల్సి పరిస్థితి నెలకొంది. కేవలం చిన్న లోపం కారణంగా వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని విద్యార్థులు తెలుపుతున్నారు. స్టాటర్ ఏర్పాటు చేస్తే పనిచేస్తుందని వారు తెలుపుతున్నారు.
2. మారని ప్రిన్సిపాల్ తీరు
నెలకు ఒకసారి మొక్కుబడిగా కళాశాలకు వస్తున్న ప్రిన్సిపాల్ పనితీరులో మార్పు రావడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కళాశాలను సందర్శించి అప్పటి డీవీఈవో కాశీనాధ్ ప్రిన్సిపాల్ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని మందలించారు. ప్రిన్సిపాల్ నుంచి లిఖిత పూర్వకంగా హామీని తీసుకున్న ప్రిన్సిపాల్ వైఖరిలో మార్పు రావడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపాల్ సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో సిబ్బందిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు.
3. పని చేయని సీసీ కెమెరాలు, బయోమెట్రిక్
సిబ్బంది పనితీరు, విద్యార్థుల కదలికలను పరిశీలించేందుకు, హాజరు వివరాల కోసం ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి కళాశాల ఆవరణలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసింది. కానీ అవి పనిచేయడం లేదు. కావాలనే సిబ్బంది ఆఫ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేసినా దానిలో వేలిముద్రలు ఏర్పాటు చేయకపోవడంతో అది పని చేయడం లేదు.
ఎండుతున్న పచ్చని లక్ష్యం
హరితహారంలో భాగంగా కళాశాలలో నాటిన మొక్కలు నీరందక ఎండిపోతున్నాయి. అధికారులు ఆర్భాటంగా నాటిన మొక్కలకు రక్షణ లేక అవి పశువుల పాలు అవుతున్నాయి. నాటిన మొక్కల్లో చాలా వరకు ఎండిపోయాయి.