కేసీ కెనాల్‌కు నీళ్లివ్వండి
ప్రభుత్వానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వినతి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటల్ని కాపాడి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నేతృత్వంలోని ప్రతినిధిబృందం శనివారం నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కలసి రైతుల ఇబ్బందులను వివరించింది. కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు 70 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని, తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయని అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పంటలు రాక, చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో అర్థమవక దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. పరిస్థితి విషమించకముందే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తుంగభద్ర నుంచి సుంకేసుల ద్వారా నిప్పులవాగుకు రెండువేల క్యూసెక్కుల చొప్పున పది రోజులపాటు విడుదల చేస్తే రాజోలి ఆనకట్ట, చాపాడు కాలువ, మైదుకూరు కాలువ, ఆదినిమ్మాయపల్లి కట్ట కింద ఆయకట్టుకు ఒక తడి నీరందుతుందని తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటానని శశిభూషణ్‌కుమార్ హామీఇచ్చారు.