‘అల’రించేలా..
‘అల’రించేలా..
Published Wed, Jan 11 2017 10:12 PM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM
నేటి నుంచి కాకినాడలో సాగర సంబరాలు
ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల
నాలుగు రోజుల పాటు అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు
350 రకాల ఫలాలు, పుష్పాలతో ప్రదర్శనలు
సంప్రదాయక వంటకాలతో 79 ఫుడ్స్‌స్టాల్స్
కాకినాడ రూరల్ (కాకినాడ రూరల్ నియోజకవర్గం) : కడలి అలుపెరగక ఆలపించే అలల గీతానికి సంగీత కళాకారులు శ్రుతి కలపనున్నారు. ఆ అలల హోయలతో పోటీపడుతూ నాట్యకారులు నర్తించనున్నారు. నయనమనోహారం, నవరసభరితమైన ప్రదర్శనలు, షడ్రుచుల విందుకు వేదిక కానున్న సాగరతీరానికి జనకెరటం పోటెత్తనుంది. కాకినాడ సమీపంలోని సూర్యారావుపేట వద్ద సముద్రతీరం సాగర సంబరాలకు(బీచ్ ఫెస్టివల్) ముస్తాబైంది. ఈ ఫెస్టివల్‌ను గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా..
12 నుంచి 15వతేదీ వరకు నాలుగురోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ ద్వారా జిల్లా ప్రాశస్త్యాన్ని తెలిపేలా 60 నుంచి 80 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 350 రకాల ఫలపుష్ప ప్రదర్శనలు, వివిధ దేశాల్లో ఉండే బోన్సాయ్ మొక్కలు, చేపల పెంపకం, వివిధ దేశాల్లో ఆక్వాకల్చర్ పార్కులు, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే రంగవల్లీ, కోలాటం, గరగనృత్యాలు, తోలుబొమ్మలాటలు, సంక్రాంతి సంబరాలు కన్పించేలా గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసు కీర్తనలు కన్పించనున్నాయి. పర్యటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక సైకత శిల్పాలు, వివిధ రకాల జాతులకు సంబంధించిన ఆవులు, కుక్కల ప్రదర్శనలు, అన్నవరం సత్యనారాయణమూర్తి ఆలయంతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన నమూనా ఆలయాల సముదాయం ఏర్పాటు, చిన్నపిల్లలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పార్కును ఏర్పాటు చేశారు. ఫెస్టివల్‌కు వచ్చే వారికి తెలుగు వంటకాలతో పాటు ప్రాచీన వంటకాల రుచులు చూపేలా 76 రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హరితా బీచ్‌రిసార్ట్స్ కూడా పర్యాటకులను ఆకర్షించేలా హట్‌లు, టెంట్ రూములు, వివిధ రకాల ఆట పరికరాలు, నీటిలో వెళ్లే స్పీడుబోట్లు, పెడల్ బోట్లుతో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసంఏసీ రూములు అందుబాటులో ఉంచారు.
సారగతీరంలో బీచ్ ఫెస్టివల్‌లో భాగంగా అధికారులు బీచ్‌లో సంబరాలు జరిగే సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రత్యేక విద్యుత్‌లైను వేసి ఎల్‌ఈడీ బల్బులు, హైమాస్ట్ లైట్లు అమర్చారు.
పర్యాటకులకు ‘నడక’యాతనే..
పోలీసులు నాలుగు చోట్ల ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఎటు చూసినా సుమారు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే అన్నట్టుగా ద్వారాలు ఏర్పాటు చేయడంతో వృద్ధులు, చిన్నపిల్లలతో వెళ్లే వారు, వికలాంగులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రోజుకు లక్ష నుంచి 1.50 లక్షలకు పైబడి పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్, జేసీ ఎస్ సత్యనారాయణ, ఆర్డీఓ బీఆర్ అంబేడ్కర్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ అలీంభాషాలు ఏర్పాట్లును పర్యావేక్షిస్తున్నారు. పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగా సాగర తీరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు 625 మందితో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.
Advertisement