‘కమల’ వికాసం!
-
అవయవ దానంతో ఐదుగురికి కొత్త జీవితం
-
కుటుంబ సభ్యుల ఔదార్యం
సాక్షి, విశాఖపట్నం: ఒక మహిళ తాను తనువు చాలించి మరో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. వారి కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఆమె కుటుంబ సభ్యుల ఔదార్యంతో ఇది సాధ్యమైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కుదుము గ్రామానికి చెందిన వలురౌతు రాజులమ్మ అలియాస్ కమల (50) కు పదేళ్ల క్రితం ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పట్నుంచి మందులు వాడుతూ ఆరోగ్యంగానే ఉన్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయింది. ఈ నెల 19న కుటుంబ సభ్యులు ఆమెను విశాఖలోని క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె సెలెబ్రెల్ బ్లీడ్‌తో బాధపడుతున్నట్టు గుర్తించి శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె బ్రెయిన్‌డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. కమల బతికే అవకాశం లేదని, అవయవదానంతో ఐదుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని జీవన్‌దాన్ ప్రతినిధులు వారికి సూచించారు. ఇప్పటికే సామాజిక సేవలో ఉన్న కమల భర్త షణ్ముఖరావు, ఇంజినీరింగ్ పట్టభద్రులైన ముగ్గురు కుమార్తెలు తుషార, గీత, జ్యోత్స్నలు సహదయంతో కమల అవయవాల దానానికి అంగీకరించారు. దీంతో వైద్యులు ఆదివారం సాయంత్రం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కమల కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి, కిడ్నీలను విశాఖలోని సెవెన్‌హిల్స్, అపోలో ఆస్పత్రులకు, కళ్లను ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి దానం చేశారు. కమల కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి చైర్‌పర్సన్ చలసాని విజయలక్ష్మితో పాటు పలువురు అభినందించారు. క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ నెఫ్రాలజిస్టు సాయినరేష్, యూరాలజిస్టు జయసాయిశేఖర్, నాగరాజ్, మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ అవయవదాన ప్రక్రియను పూర్తి చేశారు.