అభినయ (ఫైల్)
మరణించిన మనిషికి ‘పునర్జన్మ’ ఉంటుందా...? మరణానంతర ‘జీవితం’ సాధ్యమేనా..? ‘ఉంటుంది... సాధ్యమే..’నని సమాధానమిచ్చింది 14 ఏళ్ల ఓ అమ్మాయి...! తాను చనిపోయింది...!! కాద్కాదు... మరో ఐదుగురి రూపంలో ‘జీవిస్తోంది’...!!!
కొత్తగూడెంరూరల్: చుంచుపల్లి మండలం పెనుబల్లి గ్రామంలోని ఆ అమ్మాయి పేరు అవులూరి అభినయ. ఆమె తండ్రి అవులూరి శ్రీనివాస్. కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్. ఆయన గత ఏడాది మార్చి 1న, తీవ్ర అనారోగ్యంతో మృతిచెందారు. ఆ విషాదం నుంచి ఆయన కుటుంబం ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే, ఆయన ముద్దుల కూతురైన అభినయ(14)కు అనారోగ్యం. కొత్తగూడెంలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదోతరగతి చదువుతున్న ఈమెకు వారం కిందట అనారోగ్యం సోకింది.
హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో కుటుంబీకులు చేర్పించారు. వారి నెత్తిపై ‘పిడుగు’ పడింది... పిడుగులాంటి వార్తను వినాల్సొచ్చింది. అభినయ ‘లేదు’... ఇక ‘లేవదు’. ఆమె ‘బ్రెయిన్ డెడ్’ అయినట్టుగా వైద్యులు బుధవారం నిర్థారించారు. ఆమె కళ్లు బాగానే ఉంటాయి... కానీ, తెరుచుకోవు. మూత్ర పిండాలు బాగానే ఉంటాయి... కానీ, ‘పని’ చేయవు. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. కానీ, ‘పరిమితు’లుంటాయి. ఆమె శరీరంలోని ప్రధాన అవయవాలను పని చేయించే కీలకమైన మెదడు (బ్రెయిన్) మాత్రం పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది... ‘చనిపోయింది’. ఈ స్థితిలో, ఆమెలోని కొన్ని అవయవాలు (కళ్లు, గుండె, మూత్రపిండాలు, కాలేయం) కొన్ని రోజులపాటు మాత్రమే పనిచేస్తాయి.
ఇదే విషయాన్ని ఆమె కుటుంబీకులకు అక్కడి వైద్యులు తెలిపారు. ‘‘ఈ స్థితిలోనే ఆమెకు ‘పునర్జన్మ’ ఇవ్వగలం. ఆమెను మరొకరి రూపంలో ‘బతికించగలం’. ఇందుకు చేయాల్సిందల్లా... ఆమె అవయవాలను దానం చేయడమే’’నని ఆ వైద్యులు సావధానంగా వివరించారు. దీనికి, అభినయ తల్లి కవిత, సోదరుడు వెంకట్ వరుణ్ అంగీకరించారు.
ఆ తరువాత, అభినయ శరీరం నుంచి కళ్లు.. గుండె.. కాలేయం.. మూత్రపిండాలను వైద్యులు వేరు చేశారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో బాధపడుతున్న, ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఐదుగురికి అమర్చేందుకుగాను వాటిని తరలించారు.
ఆ ఐదుగురి రూపంలో అభినయ మళ్లీ బతికింది...! ఇకపై, ఆమె కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆమె గుండె కొట్టుకుంటుంది... ఇంకొకరి శరీరంలో. ఆమె కాలేయం పనిచేస్తుంది... మరొకరి శరీరంలో. ఆమె మూత్రపిండాలు పనిచేస్తాయి... వేరొకరి శరీరంలో.
మరణం... జననం...
ఆమె చనిపోయింది. కానీ, కొన్ని గంటల వ్యవధిలోనే... ఆ ఐదుగురి రూపంలో ‘పునర్జన్మ’ అందుకుంది. ఆమెకు, ఆమె తల్లి కవితకు, సోదరుడు వెంకట్ వరుణ్‌కు ఆ ఐదుగురు...
చేతులెత్తి నమస్కరిస్తారు...! నిరంతరం స్మరిస్తారు...!! తుది శ్వాస వరకు...!!!
Comments
Please login to add a commentAdd a comment