'విభజనతో నష్టపోయింది మా విభాగమే'
గుడివాడటౌన్ (కృష్ణా జిల్లా) : రాష్ట్ర విభజనలో భారీగా నష్టపోయింది వైద్యవిభాగమే అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం కృష్ణాజిల్లా గుడివాడలోని ఐఎంఏ హాలులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యాన జరిగిన కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల రీజినల్ కౌన్సిల్ సమావేశాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి కామినేని మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు. ప్రతి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్ట్, ఎనస్తీషియన్, సర్జన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఎలుకల దాడి దురదృష్టకరం..
తప్పు ఎవరు చేసినా తలవంపులు వైద్యశాఖదే అని మంత్రి కామినేని అన్నారు. గుంటూరులో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన విషయాన్ని తీవ్రంగా ఖండించడమే కాక శాశ్వత పరిష్కారానికి మార్గం కనుగొంటున్నామని చెప్పారు. ఒకరినో, ఇద్దరినో బలిచేయడం వలన సమస్య పరిష్కారం కాదని, ప్రజలు సైతం జాగ్రత్తలు తీసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి రహ్మాన్, ఐఎంఏ గుడివాడ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పొట్లూరి గంగాధరరావు, అధ్యక్ష, కార్యదర్శులు భవానీశంకర్, మాగంటి శ్రీనివాస్, డి.ఆర్.కె.ప్రసాద్, వంశీకృష్ణ, సి.ఆర్.ప్రసాదరావు, బి.సుబ్బారావు, అశోక్, సోమూరి వెంకట్రావు, వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాలుగు జిల్లాలకు చెందిన సుమారు 400 మంది వైద్యులు పాల్గొన్నారు.