ప్రత్యేకాలంకరణలో ఉత్సవ మూర్తులు
కాణిపాకం(ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి మూషిక వాహనంపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. తనకు ప్రియమైన వాహనం మూషికంపై కొలువుదీరిన గణనాథుడు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులతో పాటు కాణిపాకం పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా పంచామతాది అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ కన్పించింది. రాత్రి 9గంటల సమయంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను ఆన్వేటి మండపంలో విశేషాభరణాలు, పరిమళభరిత పుష్పమాలికలు, పట్టుపీతాంబరాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మూషిక వాహనంపై అధిష్టింపజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం లో ఊరేగించారు. భక్తులు కన్నులారా స్వామి వారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఉభయదారులు ,ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి Sకాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లి, కాణిపాక పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిన్నకాంపల్లెలకు చెందిన విశ్వకర్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు.