Bramhostavams
-
ముత్యపు పందిరిలో మురిసెను శ్రీహరి
-
ముత్యపు పందిరిలో మురిసెను శ్రీహరి
– వేడుకగా వాహన సేవల ఊరేగింపు – గోవింద స్మరణతో హోరెత్తిన మాడవీధులు – సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం సాక్షి, తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో వాహన సేవలు ఊరేగింపు వైభవంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులతో పోల్చుకుంటే ఉత్సవాలకు భక్తజనం పెరిగారు. ఉదయం సింహవాహన సేవలోనూ స్వామివారు యోగ నృసింహరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ఆలయంలో స్నపన తిరుమంజనం కన్నుల పండువలా జరిగింది. పూటకోవాహనంలో ఊరేగుతూ అలసిన స్వామివారు ఉభయ దేవేరులతో కలసి స్నపన తిరుమంజనంలో సేద తీరారు. ఆ తర్వాత ఆలయం వెలుపల కొలువు మండపంలో రాత్రి 7 గంటలకు వేయి నేతి దీపాల వెలుగులో స్వామివారు వేణుగోపాలుని రూపంలో ఊయలూగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతం వద్ద భక్తుల సందడి కనిపించింది. అనంతరం రాత్రి నిర్వహించిన ముత్యాల పందిరి సేవలో శేషాచలేశుడు మురిసిపోయారు. ముక్తిసాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా శ్రీవారు చాటిచెప్పారు. వాహన సేవల ముందు కోలాటాలు, చెక్క భజనలు, భజన బృందాలు, వివిధ వేషధారణలు, ఉడిపి వాయిద్యం, కేరళ చండీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల డోలు వాయిద్యాల కోలాహలంతో వాహన సేవల్లో సాంస్కృతిక శోభ కనిపించింది. కళాకారుల అభినయం, వేషధారణలు భక్తులు విశేషంగా అలరించాయి. మరోవైపు ఆలయం, పుష్కరిణి, నాలుగు మాడవీధుల్లో వివిధ రకాల పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాపవినాశనం రోడ్డు మార్గంలో ఏర్పాటుచేసిన పుష్ప, ఫొటో ప్రదర్శనశాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమలలో ఏర్పాటుచేసిన రంగురంగుల విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తులు కటౌట్లు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో ధగధగ మెరుస్తోంది. -
గజరాజుపై గజాననుడు
కాణిపాకం(ఐరాల) : స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఉభయ దేవేరులతో కలిసి స్వామి వారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భజన బృందాలు, కోలాట బృందాల ప్రదనలు ముందు సాగుతుండగా ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణల అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 8–30గంటల సమయంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను సర్వాలంకృతులను చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. రాత్రి ఆలయ అలంకార మండపంలో ఉత్సవమూర్తులను పట్టుపీతాంబరాలు, పరిమళభరిత పుష్పమాలికలు, విశేషాభరణాలతో అలంకరించి అలంకార మండపం వద్దకు వేంచేపు చేశారు. సంప్రదాయ పూజల అనంతరం ఉత్సవమూర్తులను గజవాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం ఆలయ మాడ వీధులు, కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ లు కేశవరావు, సూపరింటెం డెంట్ రవీంద్ర బాబు, ఇన్స్పెక్టర్లు చిట్టిబాబు, మల్లికార్జున, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు. చందనాలంకరణలో స్వామి వారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఉభయదారుల అభిషేకం ముగిసిన అనంతరం స్వామివారి మూల విగ్రహనికి చందనాలంకరణ సేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామి చందనాలంకర ణలో దర్శన మిచ్చారు. -
మూషిక వాహనంపై వరసిద్ధుడు
కాణిపాకం(ఐరాల) : కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజు గురువారం రాత్రి మూషిక వాహనంపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారు భక్తులను అనుగ్రహించారు. తనకు ప్రియమైన వాహనం మూషికంపై కొలువుదీరిన గణనాథుడు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులతో పాటు కాణిపాకం పురవీధుల్లో విహరించారు. ఉదయం ఆలయంలో స్వామి వారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా పంచామతాది అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ కన్పించింది. రాత్రి 9గంటల సమయంలో సిద్ధి,బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవమూర్తులను ఆన్వేటి మండపంలో విశేషాభరణాలు, పరిమళభరిత పుష్పమాలికలు, పట్టుపీతాంబరాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను మూషిక వాహనంపై అధిష్టింపజేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం లో ఊరేగించారు. భక్తులు కన్నులారా స్వామి వారిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. ఈఓ పూర్ణచంద్రరావు, ఏఈఓ కేశవరావు, సూపరింటెండెంట్ రవీంద్ర బాబు, ఉభయదారులు ,ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఉత్సవానికి Sకాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లి, కాణిపాక పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిన్నకాంపల్లెలకు చెందిన విశ్వకర్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు.