ముత్యపు పందిరిలో విహరిస్తున్న మలయప్ప స్వామి
– వేడుకగా వాహన సేవల ఊరేగింపు
– గోవింద స్మరణతో హోరెత్తిన మాడవీధులు
– సాంస్కృతిక కార్యక్రమాల కోలాహలం
సాక్షి, తిరుమల:
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్ని తాకేలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో వాహన సేవలు ఊరేగింపు వైభవంగా సాగుతున్నాయి. తొలి రెండు రోజులతో పోల్చుకుంటే ఉత్సవాలకు భక్తజనం పెరిగారు. ఉదయం సింహవాహన సేవలోనూ స్వామివారు యోగ నృసింహరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ఆలయంలో స్నపన తిరుమంజనం కన్నుల పండువలా జరిగింది. పూటకోవాహనంలో ఊరేగుతూ అలసిన స్వామివారు ఉభయ దేవేరులతో కలసి స్నపన తిరుమంజనంలో సేద తీరారు. ఆ తర్వాత ఆలయం వెలుపల కొలువు మండపంలో రాత్రి 7 గంటలకు వేయి నేతి దీపాల వెలుగులో స్వామివారు వేణుగోపాలుని రూపంలో ఊయలూగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంతం వద్ద భక్తుల సందడి కనిపించింది. అనంతరం రాత్రి నిర్వహించిన ముత్యాల పందిరి సేవలో శేషాచలేశుడు మురిసిపోయారు. ముక్తిసాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా శ్రీవారు చాటిచెప్పారు. వాహన సేవల ముందు కోలాటాలు, చెక్క భజనలు, భజన బృందాలు, వివిధ వేషధారణలు, ఉడిపి వాయిద్యం, కేరళ చండీ నృత్యం, మహారాష్ట్ర కళాకారుల డోలు వాయిద్యాల కోలాహలంతో వాహన సేవల్లో సాంస్కృతిక శోభ కనిపించింది. కళాకారుల అభినయం, వేషధారణలు భక్తులు విశేషంగా అలరించాయి. మరోవైపు ఆలయం, పుష్కరిణి, నాలుగు మాడవీధుల్లో వివిధ రకాల పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాపవినాశనం రోడ్డు మార్గంలో ఏర్పాటుచేసిన పుష్ప, ఫొటో ప్రదర్శనశాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుమలలో ఏర్పాటుచేసిన రంగురంగుల విద్యుత్ అలంకరణలు, దేవతామూర్తులు కటౌట్లు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంతం స్వర్ణకాంతులతో ధగధగ మెరుస్తోంది.