కన్నుల పండువగా పైడితల్లమ్మ సిరిమానోత్సవం
♦ జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన విజయనగరం
♦ దాదాపు 3 లక్షల మంది హాజరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం కన్నుల పండువగా జరిగింది. జై పైడిమాంబ నినాదాలతో విజయనగరం పట్టణం మార్మోగింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య అంగరంగ వైభవంగా సిరిమానుపై పూజారి రూపంలో ఉన్న అమ్మవారు ఊరేగారు. ఆలయ ప్రధాన పూజారి తాళ్లపూడి భాస్కరరావు అధిరోహించిన సిరిమాను.. సాయంత్రం 4.28 గంటలకు విజయనగరంలోని అమ్మవారి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమైంది. అంజలిరథం, పాలధార, తెల్ల ఏనుగు, జాలరి వల తదితర ఆధ్యాత్మిక ఘట్టాల వెంట సిరిమానోత్సవం సాగింది. మహరాజ కోట వరకు సిరిమాను మూడుసార్లు తిరిగింది.
మధ్యాహ్నం 3.35గంటలకు ప్రారంభం కావల్సిన సిరిమానోత్సవం.. ఆలస్యంగా 4.28గంటలకు ప్రారంభమై సాయంత్రం 6గంటల సమయంలో ముగిసింది. మహరాజ కోట బురుజుపై నుంచి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు దంపతులు ఉత్సవాన్ని వీక్షించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులతో విజయనగరం జనసంద్రమైంది. అడుగు వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. సిరిమానోత్సవానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు హాజరై ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు.