
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆశిస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారిని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించాను. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని కోరుకున్నాను. ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పైడితల్లి అమ్మవారి పండగను నిర్వహిస్తున్నాము' అని మంత్రి బొత్స అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లు దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 'పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ తరుపున ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి అడ్డంకులు కలగకూడదని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.