పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు సరికాదు
అవకతవకలుంటే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవచ్చు
దౌర్జన్యాలు, బెదిరింపులకు దిగే సంప్రదాయం కొనసాగకూడదు
మాజీ మంత్రి బొత్స
విజయనగరం: పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ భవనాలపై దాడులు, యూనివర్సిటీల్లో వీసీలను బెదిరించడం వంటి విషసంస్కృతి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. దౌర్జన్యాలు, కిరాతక చర్యలకు ప్రజాస్వామ్యంలో తావులేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి దుశ్చర్యలు కొనసాగకూడదని హితవు పలికారు. అధికారంలో ఉన్న వారు సంయమనం పాటించాలని సూచించారు. విజయనగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ప్రైవేట్ ఆస్తులపై దాడులా?
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదు. అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఇటీవల విజయనగరంలో వైఎస్సార్‌సీపీ ఆఫీసుకు వచ్చి బెదిరించారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటే చట్టపరంగానే చర్యలు తీసుకోవాలి. పార్టీ ఆఫీసులను కూల్చేయడం, బెదిరించడం నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ఇదిలాగే కొనసాగితే సివిల్ వార్‌గా మారే ప్రమాదముంది.
రుషికొండలోవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే..
అలాగే, విశాఖ రుషికొండలో నిరి్మంచిన ప్రభుత్వ భవనాలను ఎలా ఉపయోగించుకుంటారో ప్రభుత్వంలో ఉన్న వారి ఇష్టం. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ విడిది కోసం వాటిని వాడుకోవచ్చు. అవి పూర్తిగా ప్రభుత్వ భవనాలే. ఇంతకుముందు ఉన్న భవనాల స్థానంలోనే అత్యాధునికంగా నిరి్మంచాం. ప్రస్తుత ప్రభుత్వం రూ.4,000 పింఛన్ పథకాన్ని అమలుచేయడాన్ని స్వాగతిస్తున్నామని, మిగిలిన ఐదు గ్యారంటీలు అమలుచేసే శక్తిని ఆ భగవంతుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి వరకు పాలన చూసిన తరువాత స్పందిస్తాం.
వీసీలను బెదిరిస్తారా?
యూనివర్సిటీల వీసీలను రాజీనామాలు చేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు చేయడం అస్సలు సమంజసం కాదు. వీసీగా నామినేట్ అయిన వ్యక్తి పనితీరు బాగా లేదనిపిస్తే విచారణ చేసుకోవాలి. ఎన్నికైన నేతలు 200–300 మందిని తీసుకుని ఆఫీసులకెళ్లి బెదిరింపులకు పాల్పడడం తప్పు. ఇక మా ప్రభుత్వంలో 6,100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించాం. టెట్ కూడా నిర్వహించాం. ఆ సమయంలో 50 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని వారే చెప్పారు. మెగా డీఎస్సీ అని 25 వేల పోస్టులైనా ఇస్తారనుకున్నాం.. కానీ, 16 వేల పోస్టులకే ఎందుకు పరిమితమయ్యారో తెలీడంలేదు. మా ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ ఉద్యోగం కూడా ఇవ్వలేదనడం తప్పు. 15 వేల పోస్టుల వరకు ఇచ్చాం.
Comments
Please login to add a commentAdd a comment