
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష జరిపారు. విజయనగర సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సాంస్కృతిక, సాహిత్య,క్రీడా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, బడుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు.
చంద్రబాబుకు మతి భ్రమించింది..
చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన ఆదివారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ.. గ్రామ సచివాలయం, వాలంటీర్ల ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామన్నారు. గోదావరి బోటు ప్రమాదం గురించి ప్రస్తావిస్తూ..బోటు 300 అడుగుల లోతులో ఉండటం వలన వెలికితీత కష్టంగా మారిందని.. జరిగిన దురదృష్ట ఘటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై అనేక మంది ఇతర పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.