కనుల పండువగా పవిత్రారోపణ
ద్వారకా తిరుమల: ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం పవిత్రారోపణ కార్యక్రమం కనుల పండువగా సాగింది. రెండు రోజులుగా ఆలయంలో ఈ ఉత్సవాలను పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా ఉదయం ఆలయ యాగశాలలో హోమగుండం వద్ద అగ్ని ఆరాధన, చతుర్ధ కలశస్థాపనను ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిపారు. స్వామి, అమ్మవార్లకు అలంకరణలు చేసి పవిత్రాలను శిరస్సుపై ఉంచుకుని అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఆలయంలో కొలువైన శ్రీవారి మూలవిరాట్‌కు, ఉత్సవమూర్తులకు, అమ్మవార్లకు ఈ పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం పవిత్రాంగహోమం, శాంతి హోమాన్ని భక్తుల గోవింద నామస్మరణల నడుమ జరిపారు.