
రూటు మార్చిన ‘చంద్రన్న’
- కాపు భవనాలు, పథకాలకు చంద్రన్న పేరుపై బాబును కలిసిన నేతలు
- వ్యతిరేకత పెరుగుతోందని మాట మార్చిన ఏపీ సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల కోసం ప్రకటించిన పథకాలు, నిర్మించనున్న భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరాలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు రూటు మార్చారు. ఈ వ్యవహారంపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందని ఆదివారం సీఎంను కలిసిన కాపు నేతలు స్పష్టం చేయగా తనకు తెలియకుండా జరిగిందని సర్దిచెప్పారు. ఈ నేపధ్యంలోనే ఇకపై పథకాలకు పేర్లు పెట్టేటప్పుడు తన కార్యాలయం అనుమతి తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సీఎంవో మీడియా విభాగం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతకుముందు కాపు నేతలు పిళ్లా వెంకటేశ్వరరావు, బేతు రామ్మోహనరావు తదితరులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసి కాపు భవనాలకు చంద్రన్న భవన్, పథకాలకు చంద్రన్న పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తమ సామాజికవర్గంలో పెల్లుబికుతున్న ఆందోళనను వారు చంద్రబాబుకు వివరించారు. కాపుల పథకాలు, భవనాలకు కాపు నేతలైన శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి మోహనరంగా తదితరుల పేర్లు పెట్టాలని నేతలు కోరారు. ఈ వ్యవహారం తనకు తెలియకుండా జరిగిందని, మార్పిస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు. వెనువెంటనే సీఎంవో నుంచి ఇప్పటివరకూ పలు పథకాలకు తన పేర్లు పెట్టడాన్ని తప్పుపడుతూ ప్రకటన జారీ చేయించారు.
మొదటి నుంచి వివిధ పథకాలకు పలువురు మంత్రులు అత్యుత్సాహంతో చంద్రన్న పేరు పెడుతున్నా ముఖ్యమంత్రి వారించకుండా పరోక్షంగా ప్రోత్సహించారు. చివరికి కాపుల కోసం నిర్మిస్తున్న భవనాలకు, పథకాలకు చంద్రన్న పేరు పెట్టారు. మొదట్లో దీనిపైనా ముఖ్యమంత్రి మాట్లాడలేదు. అయితే ఆ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత పెరగడంతో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు.
రెండేళ్ల నుంచి చంద్రన్న పేర్ల తంతు నడుస్తున్నా ఇప్పుడు అభ్యంతరాలు రావడంతో తనకు తెలియకుండా పథకాలకు పేర్లు పెట్టొద్దని ప్రకటన విడుదల చేయడం విశేషం. పథకాలకు చంద్రన్న పేర్లు పెట్టే విషయం ఇప్పుడే బయటకు వచ్చినట్లు నటిస్తూ ఇప్పటివరకూ పెట్టినవి తనకు తెలియకుండా జరిగాయనే కలరింగ్ ఇచ్చుకోవడం విశేషం.