6 రోజులు...125 కిలోమీటర్లు
-
ముద్రగడ పాదయాత్ర కోసం జేఏసీ నేతల సన్నాహాలు
అమలాపురం :
నవంబర్ 16 నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ చేపట్టనున్న కాపు సత్యాగ్రహ పాదయాత్ర ఆరు రోజుల పాటు 125 కిలోమీటర్ల మేర సాగేలా కాపు జేఏసీ నాయకులు ప్రణాళిక రూపొందించారు.కాపు రాష్ట్ర జేఏసీ జాయింట్ కన్వీనర్ ఆకుల రామకృష్ణ, రాష్ట్ర కాపు రిజర్వేష పోరాటసమితి కన్వీనర్ నల్లా విష్ణుమూర్తి, కోనసీమ టీబీకే అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, నల్లా కుమార్ తదితరులు అమలాపురంలో శనివారం సమావేశమై పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించారు. పాదయాత్ర విజయవంతానికి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల కాపులతో చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామని రామకృష్ణ తెలిపారు. నవంబర్ రెండో తేదీ నుంచి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిల్లో జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి పాదయాత్రకు సమాయత్తం చేయనున్నట్టు నల్లా విష్ణుమూర్తి వెల్లడించారు. నవంబర్ 7న కాకినాడ లోని కాపు కల్యాణ మండపంలో నిర్వహించే జిల్లా కాపు జేఏసీ సమావేశానికి జిల్లాలోని కాపులంతా హాజరు కావాలని నల్లా కుమార్ కోరారు. పాదయాత్ర రూట్ మ్యాప్‌పై కూడా కాపు నాయకులు చర్చించారు. కాపు నాయకులు యేడిద దొరబాబు, పెద్దిరెడ్డి రాంబాబు, అరిగెల నాని, సలాది నాగేశ్వరరావు పాల్గొన్నారు.