రుణ దరఖాస్తుల్లో కాపులకు అందని సహకారం
కాపు కార్పొరేషన్ చైర్మ్‌న్‌కు కాపు మిత్ర బృందం ఫిర్యాదు
అమలాపురం టౌన్ : రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న కాపులకు బ్యాంకర్లు, మండల పరిషత్, బీసీ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద సహాయ సహకారాలు లభించడం లేదని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయకు కాపు మిత్ర బృందం ఫిర్యాదు చేసింది. విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్‌ను కాపు మిత్రకు చెందిన కోనసీమ నాయకుల బృందం ఆదివారం కలిసిందని ఆ బృంద ప్రతినిధి బండారు రామ్మోహనరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు రుణాల విషయంలో దరఖాస్తుదారులు పడతున్న ఇబ్బందులను ఆయనకు వివరించామన్నారు. ప్రభుత్వం కాపుల కోసం అమలు చేస్తున్న 8 పథకాల తీరుపై మాట్లాడామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,687 దరఖాస్తులకు రూ.86 కోట్లు రుణాల పంపిణీ లక్ష్యంగా కాపు నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోగా, ఇప్పటి వరకూ కేవలం 259 మందికి మాత్రమే రూ.3 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారని చెప్పామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు అసలు రుణాలే మంజూరు కాలేదని, ఈ లోపాలపై దృష్టి సారించి కాపు యువతకు త్వరతగతిన రుణాలు మంజూరయ్యేలా చూడాలని కోరినట్టు తెలిపారు. కాపు మిత్ర చైర్మన్ డాక్టర్ హరిశ్చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్‌కు వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ చలమశెట్టి హామీ ఇచ్చారని తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో కాపు మిత్ర ప్రతినిధులు పరుచూరి అప్పాజీ, కరాటం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.