
కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కుట్ర
► ముద్రగడకు సంఘీభావంగా
► కాపు నాయకుల దీక్ష
నెల్లూరు(సెంట్రల్): కాపు ఉద్యమాన్ని అణగదొక్కేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని బలిజ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, కాపు ఉద్యమ నేత తేలపల్లి రాఘవయ్య సతీమణి శోభ ఆరోపించారు. కాపు ఉద్యమ రాష్ట్రనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంఘీభావంగా నగరంలోని కేవీఆర్ పెట్రోలు బంక్ సమీపంలోని ఆమె నివాసంలో గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కార్య క్రమంలో కాపు ఉద్యమ నేతలు ఆర్.నాగేశ్వరరావు, ఇసకా మోహన్‌రావు, ఉప్పా ప్రసన్న, దుద్దుకూరు శ్రీనివాసులు, నారాయణ, దుద్దుకూరు రఘురామయ్య, భూపతి రాఘవయ్య, కిషోర్‌బాబు తది తరులు పాల్గొన్నారు.
పోలీసుల అడ్డగింపు
తన నివాసంలో దీక్ష చేస్తున్న కాపు నాయకురాలు శోభ ఇంటి వద్దకు కాపు నాయకులను ఎవరినీ రానీయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.
ముద్రగడే మా నాయకుడు
నెల్లూరు(బృందావనం): రాష్ట్రంలో బలిజ, తెలగ, కాపు కులస్తుల సంక్షేమ కోసం పార్టీల కతీతంగా సంవత్సరాల తరబడి ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభమే తమ నాయకుడని ఆయన వెంటే తామంతా నడుస్తామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ముత్యాల చంద్రమోహన్, ఆ సంఘం నాయకులు వెలిశెట్టి శ్రీహరిరాయల్, ఎర్రబోలు రాజగోపాల్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. తునిలో చోటుచేసుకున్న ఘటననకు బాధ్యులుగా అమాయకులైన కాపు యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తామంతా ముద్రగడ దీక్షకు మద్దతు పలుకుతున్నామన్నారు. కాపుల మద్దతుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి బూటకపు మాటలతో మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు.
చినరాజప్ప, నారాయణకేం తెలుసు
రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏనాడు స్పందించని రాష్ట్రహోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. కాపుల గురించి వారికి ఏం తెలుసని నాయకులు ప్రశ్నించారు. ఇకనైనా ఆచరణాత్మకంగా వ్యవహరించాలన్నారు.