అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలారని రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు.
మడకశిర రూరల్ : అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలారని రాయదుర్గం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. మడకశిరలో బుధవారం ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అమలుకాని హామీలు, పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు కానివారు జనవరి నుంచి టీడీపీ నిర్వహించబోయే జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నిర్వహిస్తున్న గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. రాష్ట్ర వైఎస్సార్‌సీపీ సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, సంయుక్త కార్యదర్శి వాగేష్, మండల కన్వీనర్ ఈచలడ్డి హనుమంతరాయప్ప, కౌన్సిలర్ పార్వతమ్మదాసప్ప, తదితర నాయకులు పాల్గొన్నారు.