'కాపు రిజర్వేషన్ అంశం జటిలమైంది'
విజయవాడ: కాపుల రిజర్వేషన్ అంశం జటిలమైందని కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జస్టిస్ మంజునాథ గురువారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కమిషన్ విధివిధానాలు, కాలపరిమితి, సభ్యుల నియామకం పై చర్చించారు. ప్రస్తుతం కాపుల జనాభా గణాంకాలు అందుబాటులో లేవని జస్టిస్ మంజునాథ అన్నారు.
13 జిల్లాల్లో పర్యటించి గణాంకాలు సేకరిస్తామని ఆయన తెలిపారు. కాపులతో పాటు అన్ని బీసీ వర్గాల అభిప్రాయాలను కూడా సేకరిస్తామన్నారు. బీసీ రిజర్వేన్‌కు వ్యతిరేకంగా ఉన్నవారి వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు. త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని జస్టిస్ మంజునాథ పేర్కొన్నారు. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదన్న సుప్రీం మార్గదర్శకాలను పాటిస్తామని తెలిపారు. అదనంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు.