ఎంపీ దత్తత గ్రామంలో 100 శాతం అక్షరాస్యత
► అటవీ గ్రామంలో అక్షర సేద్యం
► రాష్ట్రంలోనే అక్షరాస్యతలో
ఆదర్శంగా ఎంపీ దత్తత గ్రామం
► ఎన్‌ఐవోఎస్ పరీక్ష రాసిన 1031 మంది
వీర్నపల్లి గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించింది. ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో 1031 మంది నిరక్షరాస్యులు ఉండగా ఇప్పుడు అందరూ అక్షరాలు దిద్దుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామంపై కథనం..
అందరూ చదువుకుంటే అభివృద్ధి సాధ్యమని భావించిన అధికారులు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో మొదట నిరక్షరాస్యుల వివరాలు సేకరించారు. గ్రామంలో మొత్తం 1031 మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో 25 వయోజన విద్యాకేంద్రాలు ఏర్పాటుచేసి పట్టభద్రులైన నిరుద్యోగ యువకులతో వయోజనులకు అక్షరాలు నేర్పించారు. మొదటి విడతలోనే 348 మంది అక్షరాలు నేర్చుకోగా.. గత నెల 20 వరకు మిగిలిన మరో 683 మంది అక్షరాలు నేర్చుకున్నారు. గతనెల 20న జరిగిన ఎన్‌ఐవోఎస్ పరీక్షకు ఏకంగా 1031మంది హాజరై ప్రతిభ చాటారు. ఇప్పుడు వీర్నపల్లిలో 100 శాతం మంది అక్షరాస్యులే.
అడవిలో అక్షరాలు..
వీర్నపల్లి శివారులో ఉపాధి పనికి వెళ్లే కూలీలతో అడవిలోనే అక్షరాలు దిద్దించారు. దుమాలకు చెందిన ఉపాధ్యాయుడు దేవరాజు తండాలు తిరుగుతూ ఉపాధి పనికి వెళ్లే నిరక్షరాస్యులకు అడవిలోని చెట్లకిందే పాఠాలు చెప్పారు. నిరక్షరాస్యులైన కూలీలు శ్రద్ధగా పాఠాలు విని అక్షరాస్యులయ్యారు.
ప్రణాళికలతో ముందుకు..
వీర్నపల్లిలో సుమారు రెండు నెలల పాటు నిరక్షరాస్యతపై అధ్యయనం చేసిన అధికారులు, ఎంసీవో, వీసీవోలు అక్షరాస్యతపై పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేశారు. గ్రామంలో మద్యం, గుడుంబా అమ్మకాలపై దృష్టిసారించి గిరిజనులను వాటికి దూరం చేశారు. అక్షరాభ్యాసంతో కలిగే ప్రయోజనాలు వివరించారు. ఆర్డీవో, ఎంసీవోలు కొంత మంది దాతల ద్వారా అల్పహారం అందించేందుకు కృషిచేశారు. ఆర్డీవో స్వయంగా రూ. 2 వేలు, ఎంసీవో రూ.వెయ్యి, గ్రామానికి చెందిన వరద దూలిబాయి, సురేశ్, నీలం సత్తయ్య, నీలం రాజేశ్, జోగినిపల్లి రాజేశ్వర్‌రావు, సర్పంచ్ మాడుగుల సంజీవలక్ష్మి వయోజనులకు సాయంత్రం అల్పాహారం అందించారు.