Karimnagar MP
-
ఢిల్లీకి పరిమితం కాను..
కరీంనగర్ అర్బన్: పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనప్పటికీ, ఢిల్లీకి పరిమితం కాకుండా తనను గెలిపించిన ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయనని అన్నారు. ప్రజాసమస్యల పరి ష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడిగా కాకుండా సామాన్య కార్యకర్తగా ప్ర జల్లోకి వెళ్లి పనిచేస్తానన్నారు. నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తానని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉ న్నందున అధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచిం చారు. కేంద్ర సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేవిధంగా కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో ఇప్పుడిప్పుడే కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన వచ్చిందన్నారు. ఎమ్మెల్యేగా ఓటమి.. ఎంపీగా గెలుపు.. రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓటమి చెంది మూడోసారి ఎంపీగా గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇందులో యువత పాత్ర కీలకంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఓడినా తిరిగి ఎంపీగా పోటీ చేయాలని యువత ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. తమ స్వంత ఖర్చులతోనే యువత ప్రచారం చేశారని చెప్పారు. భారత్ మాతాకి జై.. అంటూ గ్రామగ్రామాన తిరిగి ప్రచారం చేశారన్నారు. యువత పట్టుదలతో కరీంనగర్లో బీజేపీని గెలిపించారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ఉంటే తప్ప ఢిల్లీకి వెళ్తానే తప్పా మిగితా సమయంలో కరీంనగర్‌లోనే ఉంటూ ప్ర జాసంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. మంత్రి పదవిపై సోషల్ మీడియా వస్తున్నది అవాస్తమని కార్పొరేటర్ నుంచి పార్లమెంట్ స్థానంలో కూర్చున్నానన్నారు. మంత్రి పదవిపై ఆశలు లేవన్నారు. కార్యకర్తలను కాపాడుకుంటూ సేవ చేయడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. హిందూ ఏక్తా యాత్ర విజయవంతం చేయాలి ప్రతీఏటా నిర్వహించే హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 29న సాయంత్రం 4 గంటలకు వైశ్యభవన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. ముఖ్య అతిథులుగా దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు సిద్దేశ్వరానందగిరి స్వామి, సామాజిక సమరసతా వేధిక తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్ హాజరవుతారని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు, కార్పొరేటర్ రాపర్తి విజయ, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, కన్నబోయిన ఓదెలు, హరికుమార్ గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మహిళ మోర్చా నాయకురాలు గాజుల స్వప్న, అనిత తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ నుంచే ఎంపీగా కేసీఆర్ పోటీ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన కోలాహలం మరో ఆరు నెలల పాటు కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలు 2019 జనవరిలో మొదలై ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కానున్నాయి. ఆ వెంటనే వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు కూడా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు సైతం పార్లమెంట్ ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి కరీంనగర్లో అత్యధిక స్థానాలను సాధించుకున్న టీఆర్ఎస్ జోష్‌తో వెళ్తోంది. కాంగ్రెస్ కూటమి, బీజేపీ తదితర పార్టీలు సైతం పార్లమెంట్ బరిలో నిలిచేందుకు సన్నద్ధం అవుతుండగా, ఆయా పార్టీల నుంచి ఎవరెవరు పోటీలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. కాగా ఒక్కో ఎన్నికల్లో ఒక్కో రకంగా ఓటు వేసి తీర్పు చెప్పే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఓటర్లు.. ఈసారి ఎలా వ్యవహరి స్తారనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈసా రి అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరు ఉంటారనేది చివరి నిమిషం వరకు చెప్పలేని పరిస్థితి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా.. అన్ని పార్టీల లక్ష్యం పార్లమెంట్ ఎన్నికలే కానున్నాయి. ఉద్ధండుల కేరాఫ్.. కరీంనగర్ పార్లమెంట్ స్థానం.. కరీంనగర్ స్థానానికి రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరుగగా, రెండుసార్లు ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. ఎస్సీఎఫ్ ఒకసారి, పీడీఎఫ్ ఒకసారి, ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు కాంగ్రెస్(ఐ), టీఆర్ఎస్ నాలుగుసార్లు, బీజేపీ రెండుసార్లు, టీడీపీ, తెలంగాణ ప్రజా సమితి ఒక్కోసారి గెలిచాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇక్కడ ఒకే టర్మ్‌లో మూడుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. ఆయన 2004లో గెలిచిన తర్వాత రెండుసార్లు తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలలో పోటీ చేసి కేంద్ర మంత్రి బాధ్యతలు కూడా చేపట్టిన ఆయన తెలంగాణ ఇవ్వడంలో జాప్యం జరగడంపై నిరసనగా మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే మరోసారి ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోటీ చేశారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి, 2014లో మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రెండుసార్లు లోక్‌సభకు, శాసనసభకు పోటీ చేసి అన్నిసార్లు గెలిచిన నేతగా కూడా కేసీఆర్ రికార్డుకు ఎక్కారు. ఎంఆర్ కృష్ణ ఇక్కడ రెండుసార్లు, పెద్దపల్లిలో రెండుసార్లు గెలిచారు. జె.చొక్కారావు మూడుసార్లు, ఎం.సత్యనారాయణరావు మూడుసార్లు (ఒకసారి టీపీఎస్, రెండుసార్లు కాంగ్రెస్), బి.వినోద్‌కుమార్ రెండుసార్లు హన్మకొండలోనూ, ఇక్కడ ఒక్కసారి, చెన్నమనేని విద్యాసాగర్‌రావు రెండుసార్లు గెలిచారు. అలాగే మరోనేత జె.రమాపతిరావు రెండుసార్లు నెగ్గారు. బద్దం ఎల్లారెడ్డి, ఎం.శ్రీరంగారావు, ఎల్.రమణ, పొన్నం ప్రభాకర్ ఒక్కోసారి గెలిచారు. కాగా 2014లో కరీంనగర్ లోక్‌సభ నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత బి.వినోద్‌కుమార్ విజయం సాధించారు. ఆయన అంతకు ముందు హన్మకొండ నుంచి రెండుసార్లు నెగ్గగా, 2009లో ఆ నియోజకవర్గం రిజర్వుడు కావడంతో కరీంనగర్‌కు మారి ఓటమిపాలైనా, 2014 ఎన్నికల్లో 2,04,652 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వినోద్‌కుమార్‌కు 5,05,358 ఓట్లు రాగా, 2009లో గెలిచి, తిరిగి 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్‌కు 3,00,706 ఓట్లు వచ్చి ఓడిపోయారు. తెలుగుదేశం మద్దతుతో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావుకు 2,54,828 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. వినోద్‌కు 2,04,652 ఓట్ల అధిక్యత లభించింది. కాగా ఈసారి అధికార పార్టీ నుంచి మళ్లీ వినోద్ పేరు ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ కూడా పోటీ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రముఖంగా పొన్నం ప్రభాకర్ పేరుండగా, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకుడు పి.సుగుణాకర్‌రావు తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 1962 నుంచి రిజర్వుడ్ స్థానంగా ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ మూడుసార్లు, కాంగ్రెస్ (ఐ) ఆరుసార్లు, టీడీపీ నాలుగుసార్లు, తెలంగాణ ప్రజాసమితి ఒకసారి, తెలంగాణ రాష్ట్ర సమితి ఒకసారి గెలిచాయి. సీనియర్ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి ఇక్కడ నుంచి నాలుగుసార్లు గెలవగా, సిద్దిపేటలో మరో మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంఆర్.కృష్ణ ఇక్కడ రెండుసార్లు, కరీంనగర్ నుంచి రెండుసార్లు గెలిచారు. మరోనేత వి.తులసీరామ్ ఇక్కడ రెండుసార్లు, నాగర్‌కర్నూల్‌లో ఒకసారి, గొట్టే భూపతి, చెల్లిమెల సుగుణకుమారి రెండేసిసార్లు గెలిచారు. కె.రాజమల్లు, వివేక్, సుమన్ ఒక్కోసారి గెలిచారు. వెంకటస్వామి కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేయగా, ఎంఆర్.కృష్ణ కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. రాజమల్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. ఈ నియోజకవర్గంలో సుమన్ అత్యధిక మెజార్టీ తెచ్చుకున్న నేతగా రికార్డుకు ఎక్కారు. ఇక్కడ ఎనిమిది మంది ఎస్సీ నేతలు పదిహేనుసార్లు విజయం సాధించారు. కాగా తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉన్న నియోజకవర్గంలో పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఒకటి. అక్కడ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేతలలో ఒకరైన బాల్క సుమన్‌కు టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వగా ఆయన ఏకంగా 2,91,158 ఓట్ల అధిక్యతతో సంచలన విజయం సాధించారు. 2009లో గెలిచిన జి.వివేక్ ఈసారి కూడా కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ తరుపున పోటీ చేసిన డాక్టర్ జె.శరత్‌బాబుకు కేవలం 63,334 ఓట్లే వచ్చి డిపాజిట్ కోల్పోయారు. ఈసారి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎంపీ జి.వివేక్‌తో పాటు మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి ఎస్.కుమార్ పేరు వినిపిస్తోంది. కాంగ్రెస్ తరపున ఇటీవల చెన్నూరు నుంచి పోటీచేసి ఓడిపోయిన బి.వెంకటేశ్ నేత తదితరులు పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. కరీంనగర్ నుంచేఎంపీగా కేసీఆర్ పోటీ? తెలంగాణ రాష్ట్ర సమితికి.. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా. జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమైన కేసీఆర్.. సెంటిమెంట్ గడ్డ కరీంనగర్ నుంచే భవిష్యత్ జాతీయ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యమం మొదలు అధికారం చేపట్టే వరకు అన్ని రకాలుగా కలిసొచ్చిన జిల్లాగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మళ్లీ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కరీంనగర్ ఎంపీ స్థానం నుంచే కేసీఆర్ పోటీ..!
తెలంగాణ రాష్ట్ర సమితికి.., ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా. జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్న కేసీఆర్.. సెంటిమెంట్ గడ్డ కరీంనగర్ నుంచే భవిష్యత్ జాతీయ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యమం మొదలు అధికారం చేపట్టే వరకు అన్ని రకాలుగా కలిసొచ్చిన జిల్లాగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మళ్లీ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమ పార్టీగా బలంగా ఎదిగిన టీఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ పార్టీ అలయెన్స్‌తో ఎన్నికల బరిలోకి దిగింది. పొత్తుల్లో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావుపై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 4,51,199 ఓట్లు రాగా, సాగర్‌జీకి 3,20,031 ఓట్లు వచ్చాయి. 1,31,168 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేబినేట్లో చేరారు. ఆ తర్వాత 2006లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టీ.జీవన్‌రెడ్డి ప్రత్యర్థి కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ 2,01,582 ఓట్ల ఆధిక్యం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామాల నేపథ్యంలో మరోసారి 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు 15,765 స్వల్ప ఆధిక్యత వచ్చింది. కేసీఆర్‌కు 2,69,452 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి. జీవన్‌రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన కేసీఆర్ 2009 మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠల్రావుపై 20,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సీఎంగా ఎన్నికై మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం వచ్చిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే.. ఇటీవలి రాజకీయ పరిణామాలు నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఈ మేరకు ఐదు రోజుల కిందట స్వయంగా ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ప్రగతిభవన్‌కు వెళ్లి ఆయనను అభినందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా తరలిన నేతలు మళ్లీ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్‌ను కోరడం.. ఆయన సమాలోచనల చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. పార్టీ శ్రేణుల్లో రెట్టింపైన ఉత్సాహం.. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడంపై పార్టీ కేడర్‌లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కూడా ఇందుకు తోడవుతోంది. వాస్తవానికి మహబూబ్‌నగర్ ఎన్నికల్లో సైతం పెద్దగా మెజార్టీ రాని సందర్భంలో 2014లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న ఆయన తిరిగి కరీంనగర్‌నే ఎంచుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే.. చివరి నిమిషంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి, ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తాజాగా కరీంనగర్ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న యోచనతో కేసీఆర్‌ను ఆహ్వానించడం చర్చకు తెరలేపింది. కేసీఆర్ ఎంపీగా కరీంనగర్ నుంచి బరిలోకి దిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో 13 నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని కూడా నేతలు యోచిస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ సెంటిమెంట్ కరీంనగర్‌పై దృష్టి సారించి సీనియర్లతో సమాలోచనలు చేస్తుండటం పార్టీ వర్గాల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. -
ఎంపీ దత్తత గ్రామంలో 100 శాతం అక్షరాస్యత
► అటవీ గ్రామంలో అక్షర సేద్యం ► రాష్ట్రంలోనే అక్షరాస్యతలో ఆదర్శంగా ఎంపీ దత్తత గ్రామం ► ఎన్ఐవోఎస్ పరీక్ష రాసిన 1031 మంది వీర్నపల్లి గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించింది. ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న ఈ గ్రామంలో 1031 మంది నిరక్షరాస్యులు ఉండగా ఇప్పుడు అందరూ అక్షరాలు దిద్దుతున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిన ఈ గ్రామంపై కథనం.. అందరూ చదువుకుంటే అభివృద్ధి సాధ్యమని భావించిన అధికారులు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న వీర్నపల్లిలో మొదట నిరక్షరాస్యుల వివరాలు సేకరించారు. గ్రామంలో మొత్తం 1031 మంది నిరక్షరాస్యులున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో 25 వయోజన విద్యాకేంద్రాలు ఏర్పాటుచేసి పట్టభద్రులైన నిరుద్యోగ యువకులతో వయోజనులకు అక్షరాలు నేర్పించారు. మొదటి విడతలోనే 348 మంది అక్షరాలు నేర్చుకోగా.. గత నెల 20 వరకు మిగిలిన మరో 683 మంది అక్షరాలు నేర్చుకున్నారు. గతనెల 20న జరిగిన ఎన్ఐవోఎస్ పరీక్షకు ఏకంగా 1031మంది హాజరై ప్రతిభ చాటారు. ఇప్పుడు వీర్నపల్లిలో 100 శాతం మంది అక్షరాస్యులే. అడవిలో అక్షరాలు.. వీర్నపల్లి శివారులో ఉపాధి పనికి వెళ్లే కూలీలతో అడవిలోనే అక్షరాలు దిద్దించారు. దుమాలకు చెందిన ఉపాధ్యాయుడు దేవరాజు తండాలు తిరుగుతూ ఉపాధి పనికి వెళ్లే నిరక్షరాస్యులకు అడవిలోని చెట్లకిందే పాఠాలు చెప్పారు. నిరక్షరాస్యులైన కూలీలు శ్రద్ధగా పాఠాలు విని అక్షరాస్యులయ్యారు. ప్రణాళికలతో ముందుకు.. వీర్నపల్లిలో సుమారు రెండు నెలల పాటు నిరక్షరాస్యతపై అధ్యయనం చేసిన అధికారులు, ఎంసీవో, వీసీవోలు అక్షరాస్యతపై పక్కా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేశారు. గ్రామంలో మద్యం, గుడుంబా అమ్మకాలపై దృష్టిసారించి గిరిజనులను వాటికి దూరం చేశారు. అక్షరాభ్యాసంతో కలిగే ప్రయోజనాలు వివరించారు. ఆర్డీవో, ఎంసీవోలు కొంత మంది దాతల ద్వారా అల్పహారం అందించేందుకు కృషిచేశారు. ఆర్డీవో స్వయంగా రూ. 2 వేలు, ఎంసీవో రూ.వెయ్యి, గ్రామానికి చెందిన వరద దూలిబాయి, సురేశ్, నీలం సత్తయ్య, నీలం రాజేశ్, జోగినిపల్లి రాజేశ్వర్‌రావు, సర్పంచ్ మాడుగుల సంజీవలక్ష్మి వయోజనులకు సాయంత్రం అల్పాహారం అందించారు. -
'సెక్షన్ - 26 సవరణపై కేంద్రమంత్రితో చర్చించా'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని అంశాలు...హైకోర్టు ఏర్పాటు... హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తుల వాటా.. తదితర అంశాలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడతో చర్చించినట్లు కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి సదానందగౌడతో వినోద్‌కుమార్ భేటీ అయ్యారు. అనంతరం వినోద్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.... విభజన చట్టంలోని సెక్షన్ - 26లో చేయవలసిన చిన్నపాటి సవరణపై కూడా మంత్రితో చర్చించినట్లు చెప్పారు. ఈ సెక్షన్లో చేసే సవరణ ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో స్థానాలు పెంచేందుకు అవకాశం ఉందన్నారు. ఇదే సవరణపై సదానందగౌడకు గతంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే దశలో ఉందన్నారు. ఈ బిల్లు తయారీపై కేంద్ర హోంశాఖ, న్యాయశాఖకు తమ అభిప్రాయాలను పంపించిందని పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు వచ్చేలా అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని మంత్రి సదానంద గౌడని కోరినట్లు చెప్పారు. ఒకటిరెండు రోజుల్లో తమ శాఖ నుంచి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తనకు హామీ ఇచ్చారన్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో 450 మంది న్యాయమూర్తులు ఉన్న విషయాన్ని కూడా ఆయనతో ప్రస్తావించారన్నారు. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు ఉన్నందున న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై చర్చించినట్లు చెప్పారు. ఉమ్మడి హైకోర్టులో 42 శాతం తెలంగాణ న్యాయమూర్తుల ఎంపిక జరగాలని కోరినట్లు తెలిపారు. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో న్యాయ శాఖలో జరిగిన అన్యాయం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక జరుగవద్దు అన్నదే తమ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని సదానంద గౌడ ఎదుట వివరించినట్లు చెప్పారు. ఇదే విధంగా లోయర్ జ్యూడిషియరీ నుంచి జరిగే ఎంపికలో తెలంగాణ వాటా ఉండాలని మంత్రికి వివరించానన్నారు. ఈ అంశాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో తప్పకుండా మాట్లాడుతానని మంత్రి హామీ ఇచ్చారు హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టులో అప్పిల్ చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. -
అగ్గిపెట్టెలో శాలువాను సోనియాకు ఇచ్చిన పొన్నం
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అగ్గిపెట్టెలో పట్టే శాలువాను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ బహూకరించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రాంతం చేనేతకు ప్రసిద్ధి అన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రానికి చెందిన చేనేత కార్మికులు గతంలో అగ్గిపెట్టెలో పట్టేంత పట్టు చీర కూడా నేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ తరహాలోనే ఇప్పుడు అగ్గిపెట్టెలో పట్టే శాలువాను తయారు చేయించి దాన్ని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పొన్నం ప్రభాకర్ బహూకరించారు. కాగా, గతంలో తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ ఇచ్చారని, కానీ ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ ఎంపీలు మాత్రం పార్లమెంటును అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.