తెలంగాణ రాష్ట్ర సమితికి.., ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు కరీంనగర్ సెంటిమెంట్ జిల్లా. జాతీయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్న కేసీఆర్.. సెంటిమెంట్ గడ్డ కరీంనగర్ నుంచే భవిష్యత్ జాతీయ రాజకీయ వ్యవహారాలకు శ్రీకారం చుట్టేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. ఉద్యమం మొదలు అధికారం చేపట్టే వరకు అన్ని రకాలుగా కలిసొచ్చిన జిల్లాగా ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు మళ్లీ దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినట్లు కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమ పార్టీగా బలంగా ఎదిగిన టీఆర్‌ఎస్ 2004లో కాంగ్రెస్ పార్టీ అలయెన్స్‌తో ఎన్నికల బరిలోకి దిగింది. పొత్తుల్లో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మొదటిసారి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విద్యాసాగర్‌రావుపై పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 4,51,199 ఓట్లు రాగా, సాగర్‌జీకి 3,20,031 ఓట్లు వచ్చాయి. 1,31,168 ఓట్ల ఆధిక్యతతో గెలిచిన కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేబినేట్‌లో చేరారు. ఆ తర్వాత 2006లో జరిగిన కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టీ.జీవన్‌రెడ్డి ప్రత్యర్థి కాగా, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ 2,01,582 ఓట్ల ఆధిక్యం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాజీనామాల నేపథ్యంలో మరోసారి 2008లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు 15,765 స్వల్ప ఆధిక్యత వచ్చింది. కేసీఆర్‌కు 2,69,452 ఓట్లు రాగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టి. జీవన్‌రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురైన కేసీఆర్ 2009 మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దేవరకొండ విఠల్‌రావుపై 20,184 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ ఎంపీగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సీఎంగా ఎన్నికై మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం వచ్చిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే.. ఇటీవలి రాజకీయ పరిణామాలు నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఈ మేరకు ఐదు రోజుల కిందట స్వయంగా ప్రకటన చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ ప్రగతిభవన్‌కు వెళ్లి ఆయనను అభినందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కూడా తరలిన నేతలు మళ్లీ కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కేసీఆర్‌ను కోరడం.. ఆయన సమాలోచనల చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ రాజకీయాల్లోకి టీఆర్‌ఎస్..
పార్టీ శ్రేణుల్లో రెట్టింపైన ఉత్సాహం..
టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడంపై పార్టీ కేడర్‌లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం కూడా ఇందుకు తోడవుతోంది. వాస్తవానికి మహబూబ్‌నగర్ ఎన్నికల్లో సైతం పెద్దగా మెజార్టీ రాని సందర్భంలో 2014లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న ఆయన తిరిగి కరీంనగర్‌నే ఎంచుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే.. చివరి నిమిషంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వరంగల్ జిల్లాకు చెందిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను రంగంలోకి దింపిన కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి, ఎంపీగా మెదక్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు తాజాగా కరీంనగర్ లోక్‌సభా స్థానం నుంచి పోటీ చేయడం వల్ల పార్టీకి బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న యోచనతో కేసీఆర్‌ను ఆహ్వానించడం చర్చకు తెరలేపింది. కేసీఆర్ ఎంపీగా కరీంనగర్ నుంచి బరిలోకి దిగితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌లో 13 నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుందని కూడా నేతలు యోచిస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ సెంటిమెంట్ కరీంనగర్‌పై దృష్టి సారించి సీనియర్లతో సమాలోచనలు చేస్తుండటం పార్టీ వర్గాల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment